తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామరక్ష. గర్భిణిగా ఉన్నప్పుడు స్త్రీ శరీరంలో చాలా మార్పులు కలుగుతాయి. ఆ ప్రభావం ఆపాదమస్తకం ఉంటుంది. తీవ్రమైన ఆలోచనలు తలను భారంగా మారుస్తాయి. మెడపై ఒత్తిడీ పెరుగుతుంది. సూక్ష్మవ్యాయామంగా పేరున్న ఈ వర్కవుట్స్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అవ్వొచ్చు. అయితే, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రయత్నించాలని మర్చిపోవద్దు.
ముందు నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలను నెమ్మదిగా పైకి ఎత్తాలి. శ్వాస విడుస్తూ తలను నెమ్మదిగా కిందికి దించాలి. ఇలా తలను పైకి-కిందికి పదిసార్లు చేయాలి.
ఇప్పుడు, తలను కుడివైపునకు నెమ్మదిగా తిప్పాలి. ఇలా చేసినప్పుడు గదవ కుడిభుజానికి ఆనుకొని ఉండేలా చూసుకోవాలి. తల తిప్పేటప్పుడు శ్వాస వదలాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ తలను మధ్యలోకి తీసుకురావాలి. ఈ విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. ఇలా పదిసార్లు కుడివైపు, పదిసార్లు ఎడమవైపు తలను తిప్పడం వల్ల మెడ ఫ్రీగా అవుతుంది.
తలను నిదానంగా వెనక్కి వంచాలి. ఇప్పుడు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు తలను నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో శ్వాస ప్రక్రియ నిదానంగా సాగేలా చూసుకోవాలి.
శ్వాస విడుస్తూ తలను ఎడమకు తిప్పి.. మళ్లీ మధ్యలోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ తలను కుడికి తిప్పి మళ్లీ యథాస్థానానికి తీసుకురావాలి. పదిసార్లు ఇలా చేయాలి.
అధికరక్తపోటు, వాంతులు కావడం, తల తిరగడం తదితర సమస్యలు ఉన్నవాళ్లు వీటిని ప్రయత్నించొద్దు.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109