Strawberries | స్ట్రాబెర్రీలను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎవరూ వీటిని అంత సులభంగా విడిచిపెట్టరు. స్ట్రాబెర్రీలు రుచిగా ఉండడమే కాదు మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. స్ట్రాబెర్రీలను పోషకాలకు నిలయంగా చెప్పవచ్చు. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. కనుక స్ట్రాబెర్రీలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు స్ట్రాబెర్రీలను తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో దాదాపుగా 98 శాతం వరకు లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేందుకు సహాయం చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి.
స్ట్రాబెర్రీలు ఎరుపు రంగులో ఉండేందుకు కారణం వాటిల్లో ఉండే ఆంథో సయనిన్స్ అని చెప్పవచ్చు. ఆంథోసయనిన్స్ ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ జాబితాకు చెందుతాయి. ఫ్లేవనాయిడ్స్ జాబితాకు ఇవి చెందుతాయి. అలాగే స్ట్రాబెర్రీలలో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది. క్వర్సెటిన్, పాలిఫినాల్స్ కూడా అధికంగానే ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. స్ట్రాబెర్రీలలో ఉండే ఆంథో సయనిన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగు పరుస్తాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి.
స్ట్రాబెర్రీలలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు రక్త నాళాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తరచూ స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. స్ట్రాబెర్రీలు రుచికి తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఉండే పలు సమ్మేళనాలు ఇన్సులిన్‌ను శరీరం సక్రమంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. కనుక స్ట్రాబెర్రీలను తింటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
స్ట్రాబెర్రీలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలను తింటే సుమారుగా 3 గ్రాముల మేర ఫైబర్‌ను పొందవచ్చు. ఇది మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. ఈ పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అందువల్ల ఈ పండ్లను తింటే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు మెదడు కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. తరచూ స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే మెదడు యాక్టివ్‌గా ఉండడంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.