Saffron Milk | గర్భంతో ఉన్న మహిళలు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగుతుంటారు. ఆయుర్వేద పరంగా చూస్తే కుంకుమ పువ్వు అనేక లాభాలను అందిస్తుంది. కనుకనే గర్భిణీలకు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగమని చెబుతుంటారు. అయితే వాస్తవానికి కుంకుమ పువ్వు కలిపిన పాలను కేవలం గర్బిణీలే కాదు, ఎవరైనా సేవించవచ్చు. కుంకుమ పువ్వు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని కలిపిన పాలను తాగితే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కుంకుమ పువ్వులో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కుంకుమ పువ్వును పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే అనేక లాభాలను పొందవచ్చు.
కుంకుమ పువ్వులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో క్రోసిన్తోపాటు సఫ్రనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉఫశమనం లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట ఈ పాలను తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
చాలా మంది భోజనం చేసిన వెంటనే గ్యాస్ వస్తుందని వాపోతుంటారు. అయితే ఇందుకు కుంకుమ పువ్వు పాలను చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ పువ్వు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. రోజూ రాత్రి పూట కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే కుంకుమ పువ్వులోనూ క్యాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని రోజూ తాగుతుంటే శరీరానికి క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు రోజూ కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే త్వరగా కోలుకోవచ్చు. ఈ పాలను సేవించడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. కానీ కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది. ఇలా కుంకుమ పువ్వును రోజూ పాలలో కలిపి తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.