Tea | మనలో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇది మన శరీరానికి ఉత్పాహాన్ని ఇవ్వడంతో పాటు మనకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది. అద్భుతమైన సమ్మేళనాలతో నిండిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెదడు శక్తి పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు టీని తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు. నీటి తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. టీ తాగడం వల్ల వచ్చే ప్రశాంతత కారణంగా దీనిని తాగడానికి అందరూ ఇష్టపడతారు. టీ 5,వేల సంవత్సరాల నాటిది. దీనిని చైనాలో కనుగొన్నారు.
వివిధ సంస్కృతులు, సంప్రదాయాల కారణంగా టీని తయారు చేసే పద్దతిలో మార్పులు వస్తున్నాయి. టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శ్రేయస్సును పెంచడంలో మనకు ఎంతో సహాయపడుతుంది. టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టీ ని తాగడం వల్ల మరణ ప్రమాదం 9 నుండి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. టీ తాగడం వల్ల సహజమైన ఉత్తేజం వస్తుంది. దీనిలో కెఫిన్ , ఎల్- థియనిన్ కలిసి ఉంటాయి. దీంతో టీ తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
టీ లో ఉండే ఎల్- థియనిన్ అనే ఆమైనో అమ్లం ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. టీ మెదడుకు ఒక అద్భుతమైన పానీయంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలా కాకుండా టీ తాగడం వల్ల కెఫిన్ నెమ్మదిగా గ్రహించబడుతుంది. దీంతో స్థిరమైన శక్తి లభిస్తుంది. టీ లో ఉండే ఎల్- థియనిన్ టీకి ఒక గొప్ప రుచిని ఇస్తుంది. టీ తాగడం వల్ల వచ్చే విశ్రాంతిని, ఆనందకరమైన అనుభూతిని కూడా ఈ అమైనో ఆమ్లం ప్రోత్సహిస్తుంది. టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. హెర్బల్ టీలను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 2018 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బ్లాక్ టీ వాసన చూడడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కనుగొనబడింది.
అలాగే కమోమిల్ టీ, పుదీనా టీ వంటి వాటిని తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. గ్రీన్ టీని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. టీ తాగడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉంటుంది. దీంతో కీళ్ల పనితీరు మెరుగుపడడంతో పాటు జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా టీ ని తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా టీ ఎంతో మేలు చేస్తుంది. టీ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. టీ తాగేవారు ఎక్కువకాలం పాటు జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. టీ అనగానే పాలు, చక్కెర, టీ పొడి వేసే తయారు చేసే టీ అనుకుంటారు చాలా మంది కానీ హెర్బల్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకున్నప్పుడే మనం ఈ ప్రయోజనాలను పొందవచ్చు. సరైన టీని ఎంపిక చేసుకుని రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.