Unhealthy Foods | మన దేశ వైవిధ్య సంస్కృతిలో ఆహారం కూడా ఒక భాగం. చిన్న చిన్న పచ్చళ్ల నుండి గొప్ప గొప్ప వంటకాలను ఎన్నో తయారు చేస్తూ ఉంటాం. అయితే మన ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. అలాగే అనారోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో ఈ ధోరణి తగ్గిందనే చెప్పవచ్చు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే దిశగా మనలో మార్పు వచ్చిందనే చెప్పవచ్చు. అయితే మనలో చాలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ ఇది అన్ని వేళలా మన ఆరోగ్యానికి మేలు చేయదని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యం మీద సృహతో మనలో చాలా మంది ఇప్పుడు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్ లో ఆరోగ్యకరమైనది అని చెప్పి హాని కలిగించే ఆహారాన్ని అమ్ముతున్నారు. కొన్ని సార్లు ఈ ఆహారం అనుకున్న దానికంటే కూడా మరీ అధ్వాన్నంగా ఉంటుందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మనం తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్క ఆధారిత ప్రోటీన్ లభించే ఆహారాల్లో సోయాచంక్స్ కూడా ఒకటి. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో సోయా చంక్స్ ప్రోటీన్ వనరుగా మార్కెట్ చేయబడడం లేదు. సోయా ఆధారిత ఆహారాలు మనకు మేలు చేసేవే అయినప్పటికీ సోయా చంక్స్ ను ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. టోఫు లేదా టెంపే వంటి వాటితో పోలిస్తే సోయాచంక్స్ తక్కువ ప్రోటీన్ ను, తక్కువ ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి. పాలక్ పనీర్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అధిక ప్రాధాన్యత కలిగిన వంటకాల్లో ఇది కూడా ఒకటి. అయితే పాలకూరలో ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి ఇనుము, క్యాల్షియం శోషణను అడ్డుకుంటాయి. దీనిని పనీర్ తో కలిపి తీసుకున్నప్పుడు పనీర్ లో ఉండే క్యాల్షియంను శరీరం గ్రహించకుండా పాలకూర అడ్డుకుంటుంది. కనుక పాలక్ పనీర్ కు బదులుగా పాలకూరను, పనీర్ ను విడివిడిగా వండుకోవడం మంచిది.
తందూరీ చికెన్ ను లేదా పనీర్ ను నూనెలో వేయించకుండా తయారు చేస్తారు. కనుక దీనిని ఆరోగ్యకరమైనదిగా తీసుకోవడం వల్ల అధిక ప్రోటీన్ లభిస్తుందని భావిస్తారు. కానీ బయట రెస్టారెంట్ లలో, హోటల్స్ లో దీనిని కల్తీ నూనె, కృత్రిమ రంగులతో తయారు చేస్తారు. కనుక దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే హానే ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టాంట్ ఉప్మా, ఓట్స్, దోశ వంటివి మనకు మార్కెట్ లో లభిస్తున్నాయి. ఇవి అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. కానీ వీటిలో ఉప్పు, చక్కెరను అధికంగా కలుపుతారు. అలాగే ఇవి పాడవకుండా ఉండడానికి వాటిలో స్టెబిలైజర్లు, శుద్ది చేసిన పిండిని కూడా ఎక్కువగా కలుపుతారు. కనుక వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
మల్టీగ్రెయిన్ పిండిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మార్కెట్ లో లభించే మల్టీ గ్రెయిన్ పిండిలో తక్కువ మొత్తంలో తృణధాన్యాలు ఉంటాయి. ఓట్స్, జొన్నలు వంటి వాటిని శుద్ది చేసిన పిండిని ఎక్కువగా కలుపుతారు. దీనిని తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు. మల్టీ గ్రెయిన్ పిండి కావాలనుకునే వారు సొంతంగా తృణధాన్యాలను కొనుగోలు చేసి పిండి ఆడించి వాడుకోవడం మంచిది. మనకు మార్కెట్ లో లస్సీ, మింట్ దహీ వంటి స్నాక్స్ లభిస్తూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ వాటిలో ఉప్పు, చక్కెరలు, స్టెబిలైజర్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
ప్రకృతి అందించే ఆహారాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే వాటిని తీసుకునే విధానం, పరిమాణాన్ని బట్టి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు.