Health | గర్భధారణ సమయంలో చాలామందికి ముక్కు, చెంపల మీద గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇలా ఎందుకొస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక వేళ వస్తే తగ్గిపోయేందుకు ఏ మందులు వాడాలి?
– ఓ పాఠకురాలు
గర్భిణుల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులూ ఉంటాయి. అందులోనూ, ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. దీని కారణంగా కొందరిలో మెలనిన్ స్థాయులు అధికం అవుతాయి. ఇది పిగ్మెంటేషన్‌కు కారణం అవుతుంది. అందులో భాగంగానే ముక్కు, చెంపల మీద గోధుమ, ముదురు గోధుమ రంగు మచ్చలు వస్తాయి. దీన్నే ‘క్లొయాస్మా’ అని పిలుస్తాం. సీతాకోక చిలుక ఆకృతిలో ముఖం మీద పరచుకుని ఉంటుంది కాబట్టి, బటర్‌ఫ్లై డిస్ట్రి బ్యూషన్ అనీ అంటారు. ప్రెగ్నెన్సీలో కొంత మందిని ఇబ్బందిపెట్టే సమస్య ఇది.
ఈస్ట్రోజెన్ హార్మోన్‌కు మెలనిన్ త్వరగా స్పందించే శరీర తత్వం ఉండటం దీనికి కారణం. ముఖ్యంగా తెలుపు, చామన ఛాయ వర్ణం ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుంది. దీన్ని ఆపేందుకు ప్రత్యేక పద్ధతులు అంటూ ఏమీ లేవు. డెలివరీ తర్వాత దానంతట అదే చర్మంలో కలిసిపోతుంది. మరోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ మచ్చలు వస్తాయి. ఇవి శాశ్వతంగా పోవాలంటే బ్లీచ్ చేయించుకోవాలి. అందుకు స్కిన్ స్పెషలిస్టు దగ్గర చూపించుకోవాలి. ఎలాంటి చికిత్స అయినా ప్రసవం అయ్యాకే తీసుకోవాలి. గర్భిణిగా ఉన్నప్పుడు ఆ జోలికి వెళ్లకూడదు. మూడోనెల తర్వాత ఇవి ఎక్కువ మందిలో వస్తాయి. కొందరిలో మూడోనెల లోపే ఏర్పడవచ్చు. నెలలు పెరిగే కొద్దీ మచ్చలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్