Tulsi Kashayam | సీజన్లు మారినప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరు జ్వరంతో కూడా బాధపడుతుంటారు. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై కోవిడ్ మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. కనుక ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉంటే రోగాలకు ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే ఒక కషాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడం చాలా సులభం. మన వంట ఇంట్లో లభించే పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ కషాయాన్ని తయారు చేసి తరచూ తాగవచ్చు. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక ఆ కషాయం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగు గ్లాసుల నీటిలో అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, నాలుగైదు తులసి ఆకులు, కొన్ని మిరియాలు, 2 లవంగాలు, కొద్దిగా వాము, యాలకులు వేసి ఆ నీటిని స్టవ్‌పై పెట్టి బాగా మరిగించాలి. నీరు 2 గ్లాసులు అయ్యే వరకు మరిగిస్తే చిక్కని కషాయం రెడీ అవుతుంది. దీన్ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగాలి. ఈ కషాయం చేయడం చాలా సులభం. ఒకసారి తయారు చేసి 4 రోజుల వరకు నిల్వ చేసి దాన్ని రోజూ కాస్త వేడి చేస్తూ తాగవచ్చు. ఇందులో వాడే పదార్థాలు అన్నీ సహజసిద్ధమైనవే. కనుక ఈ కషాయాన్ని తాగితే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ కషాయాన్ని తాగితే అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
తులసి కషాయాన్ని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం పోరాటం చేస్తుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్యల నుంచి బాధపడుతున్నవారు ఇంగ్లిష్ మెడిసిన్లను వాడే బదులు ఈ కషాయాన్ని తయారు చేసి రోజుకు 2 సార్లు తాగితే ఫలితం ఉంటుంది. తులసి కషాయాన్ని సేవిస్తుంటే గొంతు, ఊపిరతిత్తుల్లో ఉండే కఫం పోతుంది. శ్వాస మార్గాల్లో ఉండే అడ్డంకి పోయి గాలి సరిగ్గా ఆడుతుంది. ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. ఈ కషాయంలో విటమిన్లు ఎ, సి, కె అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
తులసి కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరుగుతుంది. తులసి కషాయాన్ని తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ కషాయం ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయాన్ని తరచూ సేవిస్తుంటే నోట్లోని బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తులసి కషాయంతో అనేక లాభాలను పొందవచ్చు.