Spring Onions | ఉల్లికాడలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని చాలా మంది అంతగా వాడరు. ఉల్లికాడలను కొందరు కూరల్లో వేస్తుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి అనేక లాభాలను అందిస్తాయి. ఉల్లికాడల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఉల్లికాడలను తరచూ ఆహారంలో భాగం చేసుకున్నా లేదా ఉల్లికాడలతో జ్యూస్ తయారు చేసి రోజూ 30 ఎంఎల్ మోతాదులో సేవిస్తున్నా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉల్లికాడల్లో కెమోఫెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక ఫ్లేవనాయిడ్. రక్తనాళాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తం సాఫీగా ప్రసారం అయ్యేట్లు చేస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది.
ఉల్లికాడలను తరచూ తీసుకుంటే హైబీపీ నియంత్రణలో ఉంటుంది. వీటిల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని తరచూ తింటే ఎముకలు దృఢంగా మారి, ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా చూస్తాయి. ఉల్లికాడల్లో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ఉల్లికాడలను తరచూ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాదు. ఉల్లికాడల్లో క్రోమియం అధికంగా ఉంటుంది. కాబట్టి తరచూ వీటిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఉల్లికాడలు ఎంతో మేలు చేస్తాయి. రోజూ వీటి జ్యూస్‌ను సేవిస్తుంటే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉల్లికాడలతో తయారు చేసే సూప్‌ను తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. ఆయా సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. ఉల్లికాడల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి బయట పడవచ్చు. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఉల్లికాడల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో రోగాల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. అలాగే ఉల్లికాడలను తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ రాదని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
ఉల్లికాడల్లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు ఉల్లికాడలతో సూప్‌ను తయారు చేసి రోజూ తాగుతుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఉల్లికాడల్లో క్వర్సెటిన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే అధికంగా బరువు ఉన్నవారు ఉల్లికాడలతో సూప్‌ను తయారు చేసి రోజూ తాగుతుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా ఉల్లికాడలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.