Okra Water | బెండకాయలను మనం తరచూ తింటూనే ఉంటాం. వీటితో తయారు చేసే వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. టమాటాలతో కలిపి కూడా వీటిని వండి తింటారు. బెండకాయలతో పులుసు కూడా చేస్తుంటారు. బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. కనుకనే వీటితో తయారు చేసే కూరలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే మీకు తెలుసా..? బెండకాయలతో నీళ్లను తయారు చేసి తాగితే బరువు తగ్గవచ్చు. పోషకాహార నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. బెండకాయలలో ఫైబర్‌తోపాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదపడతాయి. బెండకాయలను తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.
షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలోనూ బెండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. బెండకాయలను తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. 100 గ్రాముల బెండకాయలను తింటే సుమారుగా 33 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. ఆకలి త్వరగా అనిపించదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బెండకాయల నీళ్లను తాగడం వల్ల అందులో ఉండే జిగురు వంటి పదార్థం మన పొట్టలో కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీంతో ఆకలిగా అనిపించదు. ఇతర ఆహార పదార్థాలను తినము. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. మెటబాలిజం మెరుగు పడితే శరీరంలో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు బెండకాయలు దోహదం చేస్తాయి. ఇక అధిక బరువును తగ్గించుకునేందుకు గాను బెండకాయల నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
4 లేదా 5 బెండకాయలను తీసుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనెను తీసుకోవాలి. బెండకాయలను బాగా కడిగి చివర్లను కట్ చేయాలి. అనంతరం వాటిని పొడవుగా మధ్యలోకి చీరుకోవాలి. అలా చీరిన ముక్కలను గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బెండకాయ ముక్కలను తీసేయాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి ఉదయం అల్పాహారం చేయడానికి 30 నిమిషాల ముందు లేదా రాత్రి డిన్నర్ చేసేందుకు 30 నిమిషాల ముందు తాగాలి. ఈ విధంగా బెండకాయల నీళ్లను తయారు చేసి రోజూ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. ఈ నీళ్లను తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సైతం బయటకు పోతాయి. రోగాల నుంచి శరీరం సురక్షితంగా ఉంటుంది. ఈ విధంగా బెండకాయల నీళ్లు మనకు ఎంతగానో దోహదం చేస్తాయి.