Natural Mouthwash | నోరు శుభ్రంగా ఉంటేనే నోటి దుర్వాసన ఉండదు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నోట్లో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. దీంతో నలుగురిలో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోరు శుభ్రంగా లేకపోతే దంతాలు, చిగుళ్లలో బ్యాక్టీరియా పెరిగి నొప్పులు వస్తాయి. దంత క్షయం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంటుంది. నోరు శుభ్రంగా లేకపోతే ఇన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక నోటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు గాను దంతాలను రోజుకు 2 సార్లు శుభ్రం చేయాలి. అలాగే మౌత్ వాష్లను ఉపయోగించాలి. అయితే మార్కెట్లో మనకు అనేక రకాల మౌత్ వాష్‌లు లభిస్తున్నాయి. కానీ మనం ఇంట్లోనే చాలా సులభంగా మౌత్ వాష్లను తయారు చేసి ఉపయోగించవచ్చు. వీటి వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. అన్ని రకాల నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
మన అందరి ఇళ్లలోనూ కొబ్బరినూనె ఉంటుంది. దీన్ని చాలా మంది వంటలకు లేదా జుట్టు సమస్యలకు, చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారు. కానీ కొబ్బరినూనె నోటి సమస్యలకు కూడా పనిచేస్తుంది. దీన్ని సహజసిద్ధమైన మౌత్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరినూనెలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని ఉపయోగిస్తే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని నోట్లో పోసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. అనంతరం నూనెను ఉమ్మేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా చేస్తుండడం వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. అన్ని రకాల నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఉప్పు నీళ్లను కూడా సహజసిద్ధమైన మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి అనంతరం ఆ నీళ్లతో నోటిని బాగా పుక్కిలించాలి. నీళ్లు అయిపోయే వరకు 10 నిమిషాల పాటు బాగా పుక్కిలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల కూడా నోరు శుభ్రంగా మారుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే సహజసిద్ధమైన మౌత్ వాష్ గా కలబంద రసం కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసం కలపాలి. అనంతరం దాంతో నోటిని పుక్కిలించాలి. ఇలా చేస్తుండడం వల్ల కూడా నోటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దంతాలు, చిగుళ్లను రక్షించడంలో ఈ రసం కూడా అద్బుతంగా పనిచేస్తుంది. దీని వల్ల దంతాల మధ్య ఉండే పాచి తొలగిపోతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
దాల్చిన చెక్క నూనె, లవంగాల నూనె మిశ్రమాన్ని కూడా మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు. ఇందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 10 చుక్కల దాల్చిన చెక్క నూనె, 10 చుక్కల లవంగాల నూనె వేసి బాగా కలపాలి. అనంతరం ఈ నీళ్లను కొద్ది కొద్దిగా నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు అయిపోయే వరకు ఇలా చేయాలి. రోజూ ఇలా చేస్తుండడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దాల్చిన చెక్క నూనె, లవంగాల నూనెల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనెలు యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక నోట్లో ఉండే బ్యాక్టీరియా సమూలంగా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంత క్షయం ఉన్నవారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని 2 రోజులకు ఒకసారి వాడినా కూడా ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇలా ఈ సహజసిద్ధమైన మౌత్ వాష్‌లలో దేన్ని ఉపయోగించినా సరే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.