Low Blood Pressure | ప్రస్తుతం చాలా మందికి హైబీపీ వస్తున్న విషయం విదితమే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కొందరు లో బీపీతో కూడా బాధ పడుతుంటారు. లో బీపీ సమస్య ఉంటే కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొందరికి మాత్రం పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. లో బీపీ సమస్య వచ్చేందుకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అయితే లక్షణాలు లేకుండా లోబీపీ ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని, కానీ లక్షణాలతో లో బీపీ ఉంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడిన వారిలో సహజంగానే లో బీపీ వస్తుంటుంది. శరీరంలోని ద్రవాలు వేడి లేదా పలు ఇతర కారణాల వల్ల త్వరగా ఖర్చవుతాయి. దీంతో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా డీ హైడ్రేషన్ బారిన పడతారు. ఇలాంటి సమయాల్లో లో బీపీ వస్తే మాత్రం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొందరు రోజంతా ఎలాంటి పనిచేయకుండా బద్దకంగా ఉంటారు. లేదా నిరంతరం కంప్యూటర్ ఎదుట కూర్చుని పనిచేస్తూ ఎలాంటి వ్యాయామం కూడా చేయరు. అలాగే నిద్ర కూడా ఎక్కువగా పోతుంటారు. అతిగా నిద్రిస్తుంటారు. దీంతో శరీర హృదయ సంబంధ వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. రక్త సరఫరా సరిగ్గా ఉండదు. ఇది లో బీపీకి దారి తీస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు కూడా కొన్ని సార్లు లోబీపీ బారిన పడే అవకాశాలు ఉంటాయి. గర్భంతో ఉన్న సమయంలో మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కొన్ని సార్లు ఏర్పడుతుంది. దీంతో రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. దీని వల్ల బీపీ తగ్గుతుంది. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా లో బీపీ ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు. కానీ ఏవైనా లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.
వయస్సు మీద పడడం, గుండె సంబంధిత సమస్యలు ఉండడం, గుండె సాధారణం కన్నా తక్కువ వేగంగా కొట్టుకోవడం, హార్ట్ ఫెయిల్యూర్ అవడం, థైరాయిడ్ సమస్యలు, షుగర్ లెవల్స్ పడిపోవడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల కూడా లోబీపీ వస్తుంది. లోబీపీ వచ్చినప్పుడు కొందరిలో లక్షణాలు కనిపించవు. కానీ కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి. లో బీపీ ఉన్నవారిలో తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరికి స్పృహ కోల్పోతున్నట్లు అవుతుంది. కంటి చూపు మసకగా మారుతుంది. తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. వికారంగా ఉంటుంది. చేసే పనిమీద ధ్యాస పెట్టడం కష్టంగా మారుతుంది. ఆందోళన, కంగారు ఉంటాయి. శరీరం చల్లగా మారుతుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ బీపీ తక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది.
లో బీపీ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. అలాగే పలు రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. హైబీపీ మాదిరిగా లోబీపీ మరీ అత్యంత ప్రమాదకరం ఏమీ కాకపోయినా లక్షణాలు తరచూ కనిపిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఇక లో బీపీ ఉన్నవారు సోడియుం ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా కాస్త ఉప్పు వేసి వేయించిన పల్లీలు, బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు వంటివి తినాలి. అలాగే ఊరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సముద్రపు ఉప్పు లేదా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించాలి. నీళ్లను ఎక్కువగా తాగుతుండాలి. ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే కొబ్బరి నీళ్లను సేవించాలి. పండ్ల రసాలను తాగుతున్నా ఫలితం ఉంటుంది. మోతాదులో టీ, కాఫీలను తాగవచ్చు. డార్క్ చాకొలెట్లను తింటే వాటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ బీపీని కంట్రోల్ చేస్తాయి. ఇలా లో బీపీ ఉన్నవారు పలు జాగ్రత్తలను పాటిస్తే ఈ సమస్య నుంచి సురక్షితంగా ఉండవచ్చు.