Liver Damage Symptoms | మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది సుమారుగా 800కు పైగా జీవక్రియలను నిర్వహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మనకు శక్తి అందేలా చూస్తుంది. శరరీంలోని కొవ్వును కరిగిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే లివర్‌లో కొవ్వు చేరినా, ఇతర కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అయినా మన శరీరం మనకు పలు సూచనలను తెలియజేస్తుంది. ఆ లక్షణాలను బట్టి మన లివర్ పాడైందని అర్థం చేసుకోవాలి. ఇక లివర్ డ్యామేజ్ అయినప్పుడు మన శరీరం ఎలాంటి సంకేతాలను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా అవయవాల్లో నీరు చేరుతుంది. దీంతో శరరీం వాపులకు లోనవుతుంది. కాళ్లలో, పాదాల్లో వాపులు వస్తాయి. మడమల దగ్గర వాపులు కనిపిస్తాయి. వేలితో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణం గనక కనిపిస్తుందంటే లివర్ పాడైందని అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే లివర్ డ్యామేజ్ అయిన వారికి పచ్చ కామెర్లు వస్తాయి. దీంతో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. అయితే కామెర్లు వచ్చినంత మాత్రాన లివర్ డ్యామేజ్ అయిందని కాదు. కానీ కామెర్లు కనిపిస్తే మాత్రం అజాగ్రత్త చేయకూడదు. అది లివర్ డ్యామేజ్‌కు సూచన కూడా అయి ఉండవచ్చు. కనుక ఈ లక్షణం కనిపించినా కూడా అనుమానించాల్సిందే.
లివర్ డ్యామేజ్ అయినప్పుడు లేదా లివర్‌లో కొవ్వు పేరుకుపోయినప్పుడు చర్మం మెరిసినట్లు కనిపిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను లివర్ బయటకు పంపలేదు. అందువల్ల చర్మం అలా కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తున్నా కూడా జాగ్రత్త పడండి. అదేవిధంగా లివర్ డ్యామేజ్ అయితే కాళ్లలో రక్తనాళాలు సాలె పురుగుల మాదిరిగా బయటకు కనిపిస్తాయి. ఇక శరీరంలో ఏ భాగంలో అయినా సరే సులభంగా గాయాలు అవుతున్నా, తరచూ దురద వచ్చి దద్దుర్లు కనిపిస్తున్నా లివర్ డ్యామేజ్ అయిందని అర్థం చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారిలో సైతం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.
లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మచ్చలను గమనించవచ్చు. లేదా గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే నడుస్తున్నప్పుడు కాళ్లలో అసౌకర్యంగా ఉంటుంది. సరిగ్గా నడవలేకపోతుంటారు. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లివర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలను చేయించుకోవాలి. దీంతో లివర్ సరిగ్గా పనిచేస్తుంది లేనిదీ తేలిపోతుంది. ఫలితంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే చికిత్స తీసుకోవచ్చు. దీని వల్ల లివర్ పూర్తిగా దెబ్బతినకుండా ఉంటుంది. ప్రాణాంతకం కాకుండా ముందుగానే మనల్ని మనం రక్షించుకోవచ్చు.