గాల్‌బ్లాడర్ స్టోన్స్… వీటినే వాడుక భాషలో పిత్తాశయ రాళ్లు అంటారు. ఈ పిత్తాశయం అనేది కాలేయం కింది భాగంలో ఉంటుంది. కాలేయం నుంచి పైత్య రసం పిత్తనాళం ద్వారా చిన్న పేగుకు చేరుతుంది. దీనినే కామన్ బైల్డక్ అంటారు. అంతేకాకుండా పిత్తాశయంలోని పైత్యరసం ఖాళీ అయినప్పుడు అది కూడా పిత్తనాళం ద్వారానే చిన్న పేగుకు చేరుతుంది. ఈ క్రమంలో పిత్తాశయంలో లేదా పిత్తనాళంలో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే పిత్తనాళంలో రాళ్లు ఏర్పడటం అనేది అరుదుగా చూస్తుంటాం. ఈ పిత్తాశయంలో, పిత్తనాళంలో ఏర్పడే రాళ్లు, వాటితో తలెత్తే సమస్యలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా పద్ధతులను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
అధిక బరువు, ఊబకాయంతో సతమతమయ్యే వాళ్లలో గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా హర్మోన్ల మార్పిడి వల్ల పురుషుల్లో కన్నా మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే డయాబెటిస్ రోగుల్లో కూడా గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అయితే 80 నుంచి 90 శాతం వరకు పిత్తాశయంలోని రాళ్లు సైలెంట్‌గా ఉంటాయి. అంటే వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఏదైనా ఇతర అనారోగ్య సమస్యల కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినపుడు గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్లు బయటపడుతుంటాయి. అయితే పిత్తాశయ రాళ్ల వల్ల పెద్ద సమస్యలు ఉండవు. అందుకని వీటికి పెద్దగా చికిత్స తీసుకునే అవసరం ఉండకపోవచ్చు.

10-20 శాతం మందిలో కొన్నిసార్లు పిత్తాశయంలోని రాళ్ల వల్ల ఇన్ఫ్లమేషన్ గానీ, ఇన్ఫెక్షన్ గానీ తలెత్తుతుంది. దీనివల్ల ఉదరం పైభాగంలో భరించలేని నొప్పి వస్తుంది. కామెర్లు రావడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. ఈ స్కానింగ్ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలా తీవ్రమైన నొప్పికి కారణమయ్యే పరిస్థితినే వైద్య పరిభాషలో ‘అక్యూట్ కాలిక్యులస్ కోలిస్సిైస్టెటిస్’ అంటారు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇలాంటి సందర్భంలో వెంటనే శస్త్రచికిత్స జరిపి, రాళ్లను తొలగించాల్సి ఉంటుంది.
పిత్తాశయంలో ఉన్న రాళ్లు కొన్నిసార్లు పిత్తనాళంలోకి అడ్డుగా పడిపోవచ్చు. దీనినే కామన్ బైల్డక్ స్టోన్ (సీబీడీ) అంటారు. ఇలాంటి సమయంలో రోగికి తీవ్రమైన నొప్పి లేదా కామెర్లు (జాండీస్) రావడం జరుగుతుంది. అంతేకాకుండా ‘అక్యుట్ ప్యాంక్రియాటైటిస్’ అనే జబ్బు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకని సకాలంలో శస్త్రచికిత్స చేయడం చాలా అవసరం. లేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

పిత్తాశయ రాళ్లకు అన్ని సందర్భాలలో శస్త్రచికిత్స అవసరం లేదు. కానీ, డయాబెటిస్ రోగులు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే మహిళలు గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమం. లేకపోతే అది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. పిత్తాశయ రాళ్ల వల్ల నొప్పి వచ్చినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. మందుల వల్ల గాల్‌బ్లాడర్ స్టోన్స్ (పిత్తాశయంలోని రాళ్లు) గానీ, కామన్ బైల్డక్ స్టోన్స్ (పిత్తనాళం రాళ్లు) గానీ కరగకపోవచ్చు. అందుకని ఈ రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం.
పిత్తాశయంలోని రాళ్ల వల్ల 80 నుంచి 90 శాతం వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఏ విధమైన లక్షణాలు, సమస్యలు లేనంత వరకు పిత్తాశయంలోని రాళ్ల కోసం చికిత్స అవసరం పడకపోవచ్చు. కానీ, పిత్తనాళంలో ఉన్న రాళ్ల విషయంలో మాత్రం చికిత్స తప్పనిసరి. వాటివల్ల ఎలాంటి సమస్య లేనప్పటికీ ఎప్పటికైనా కామెర్లు, జ్వరం, ప్యాంక్రియాటైటిస్ సమస్యలు పొంచి ఉంటాయి.
ఎండోస్కోపి శస్త్రచికిత్స పద్ధతి (ఈఆర్సీపీ)ద్వారా పిత్తనాళంలో ఉన్న రాళ్లను తొలగించడం ఉత్తమం. ఇది అడ్వాన్స్ శస్త్రచికిత్స. గతంలో ఓపెన్ సర్జరీ ద్వారా చేసేవారు. ఓపెన్, ల్యాపరోస్కోపీ సర్జరీల కంటే ఈఆర్సీపీ పద్ధతిలో చాలా సులభమైన పద్ధతి. కాగా, పిత్తనాళంలోని రాళ్లను తీసిన తరువాత పిత్తాశయం సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిత్తాశయంలోని రాళ్లు మళ్లీ పిత్తనాళంలోకి పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని పిత్తాశయంలోని రాళ్లను పూర్తిగా తొలగిస్తే, పిత్తనాళంలో మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. కీహోల్ పద్ధతి ద్వారా పిత్తాశయంలోని రాళ్లను తొలగించడం జరుగుతుంది.
– మహేశ్వర్‌రావు బండారి
– డా॥ రామాంజనేయులు (ఎండీ, డీఎం)
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
హెపటాలజిస్ట్ అండ్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్