Laughter Therapy | ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయి. డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఆందోళన, కంగారు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది రోజూ మనస్ఫూర్తిగా నవ్వడమే మానేశారు. ఏదైనా కామెడీ మూవీ చూస్తేనో, జోక్ చదివితేనో, ఫన్నీగా జరిగితేనో తప్ప అసలు ఎవరూ నవ్వడం లేదు. కానీ లాఫ్టర్ థెరపీ కూడా ఉంటుందని మీకు తెలుసా. ఈ థెరపీ వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. లాఫ్టర్ థెరపీని పాటించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు. లాఫ్టర్ థెరపీ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నవ్వడం వల్ల సహజసిద్ధంగా మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నవ్వినప్పుడు మన శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. వీటినే ఫీల్ గుడ్ హార్మోన్లు అంటారు. దీంతో స్ట్రెస్ హార్మోన అయిన కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా మైండ్ రిలాక్స్ అవుతుంది. టెన్షన్ పోతుంది. మనసుకు తాజాదనం లభించినట్లు అవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని డాక్టర్లు అంటున్నారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నవ్వడం అనేది రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్ చేస్తుందట. దీంతో శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి రోగాలను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. క్రిములను నాశనం చేస్తాయి. అందువల్ల నవ్వడాన్ని కూడా మీరు మీ దినచర్యలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
నవ్వడం వల్ల సాధారణ వ్యాయామం చేసినట్లు అవుతుందట. దీంతో గుండెకు చక్కని వ్యాయామం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఫలితంగా హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని, హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు. నవ్వడం వల్ల మన శరీరంలో సెరొటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. వీటిని హ్యాప్పీ హార్మోన్లు అంటారు. ఇవి ఒత్తిడి, ఆందోళన, కంగారు, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మూడ్ మారుతుంది. ఎల్లప్పుడూ విచారంగా ఉండే వారు లాఫ్టర్ థెరపీని పాటిస్తే ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు.
నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా తీవ్రమైన నొప్పులు ఉన్నవారు లాఫ్టర్ థెరపీని పాటిస్తే చక్కని ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు ఒక్కరే ఒక దగ్గర కూర్చుని నవ్వుతూ లాఫ్టర్ థెరపీ చేసుకోవడం కాకుండా అందరితో కలిసిపోయి నవ్వాలి. గ్రూప్ లాఫ్టర్ థెరపీలో పాల్గొనాలి. దీంతో ఇరుగుపొరుగు వారు, బంధువులు లేదా స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఇది మనిషికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
నవ్వడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం నవ్వినప్పుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో తీసుకుంటాయి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా శరీరానికి ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. లాఫ్టర్ థెరపీ వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా నవ్వడం వల్ల ఎన్నో అద్భ/తమైన ప్రయోజనాలు పొందవచ్చు. కనుక రోజూ కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బిగ్గరగా నవ్వడం అలవాటు చేసుకోండి.