కొన్ని అపోహలు జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి. కొన్ని భయాలు రుగ్మతలకు మరింత దగ్గర చేస్తాయి. కొన్ని అశాస్త్రీయ భావనలు ఆధునిక వైద్యాన్ని మనకు అందకుండా చేస్తాయి. మోకీళ్ల శస్త్ర చికిత్సకు సంబంధించి కూడా ఎన్నో దుష్ప్రచారాలు. వాటన్నిటినీ అధిగమించి.. శస్త్ర చికిత్సకు సిద్ధ్దపడితే.. మళ్లీ నడవవచ్చు, ఏ ఇబ్బందీ లేకుండా మెట్లు ఎక్కవచ్చు, నిటారుగా, సౌకర్యంగా నిలబడవచ్చు.
భరించలేనంతగా..
మోకీళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోవడంతో నడవటం, నిలబడటం కూడా ఇబ్బందే అవుతుంది. దీనికి కారణం మోకాలు కీళ్లు దెబ్బతినడమే. అయితే, ఎంత వృద్ధులైనా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సతో మంచిగా కోలుకోవచ్చు. చురుకుగా తిరగొచ్చు. పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరిన కీలును తొలగించి, ఆ స్థానంలో కొత్తది అమర్చుతారు. ఇందుకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరోమాట, కీళ్లమార్పిడికి వృద్ధాప్యం ఏమాత్రం అవరోధం కాదు.
మోకాళ్ల నిర్మాణం వైవిధ్యమైంది. ఆ భాగంలో రెండు ఎముకలూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. వాటిని కలిపి ఉంచే కీలు.. మోకాలు దిగువ భాగంలో కదలికకు తోడ్పడుతుంది. ఈ కదలిక సహజంగా జరగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు.. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనివార్యం. ఆ ఆపరేషన్ రోగిని తిరిగి సాఫీగా నడిపించగలుగుతుంది. సాధారణంగా ఆర్థోపెడిక్ సర్జన్ల్లే కీళ్లమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. తీవ్రమైన ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, అంగవైకల్యాన్ని కూడా కీళ్లమార్పిడి ద్వారా సరిచేయవచ్చు. కీలు దెబ్బతినడంతో చాలామంది నడవలేరు, నిలబడలేరు, మెట్లెక్కలేరు, రోజువారీ పనులు చేసుకోవడంలోనూ ఇబ్బంది కలుగుతుంది. సాధారణ జీవితం గడపడానికి మోకీలు మార్పిడి ఒక్కటే మార్గం. కీళ్ల నొప్పుల సమస్యను పరిష్కరించడంలో డాక్టర్లు చేసే చిట్టచివరి ప్రయత్నమే కీళ్లమార్పిడి. సర్జరీ చేస్తున్నప్పుడు సమస్య తీవ్రతను బట్టి, అప్పటికే జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైతే కీలు మొత్తాన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఇది వైద్యపరంగా తప్పనిసరి పరిస్థితి.
ఇలా ఎందుకు?
చాలా సందర్భాలలో.. కాలి ఎముకలను మృదువుగా కదిలేలా చేసే మృదులాస్థి (కార్టిలేజ్) అరిగిపోవడంతో తలెత్తే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగానే మోకాలు కీళ్లు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. కొన్ని కుటుంబాలలో ఈ సమస్య వంశపారం పర్యంగా వస్తుంది. కీళ్లలోని ఎముకల చివరలో ఉండే మృదులాస్థిని చుట్టుముట్టే వ్యాధుల మూలంగా మోకీళ్ల సమస్యలు ఏర్పడుతాయి. నేరుగా కారణం కాక పోయినా, ఊబకాయం వల్ల మోకాళ్లపై భారం పెరిగిపోయి, కీళ్లు దెబ్బతింటాయి. ఈ రకమైన ఆరోగ్య సమస్యల వల్ల కీళ్లు బలహీనపడిపోతాయి. క్రమంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. రోజూ తాగే నీటిలోని కొన్ని ప్రమాదకర రసాయనాలు కూడా సమస్యకు ఓ కారణం కావచ్చు. వయసు పైబడిన కొద్దీ పరిస్థితి మరింత విషమిస్తుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ మోకాలు కీలులోని మృదులాస్థి, ఎముక పూర్తిగా దెబ్బతింటాయి.

Joints
కీలు మొత్తం మార్చాలి
ఆర్థరైటిస్ చివరిదశకు చేరుకున్న తర్వాత.. మందులతో ఉపశమనం సాధ్యం కాదు. అప్పటికే కీలు నిరుపయోగంగా మారిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మొత్తం కీలును మార్చేసి.. మోకాలు కదలికను పునరుద్ధరించేలా కీళ్ల మార్పిడి సర్జరీ చేస్తారు. దీని ద్వారా దెబ్బతిన్న కార్టిలేజ్, ఎముక ఉపరితలాన్ని తొలగించి లిగమెంట్‌కు నష్టం ఏర్పడే పరిస్థితిని నివారిస్తారు. మార్పిడికి ఉపయోగించే కృత్రిమ కీళ్లను టైటానియం, కోబాల్ట్ క్రోమ్, స్టెయిన్లెస్ స్టీల్ వంటి లోహాలతోనూ; సిరామిక్, ప్లాస్టిక్ (పాలియిథిలిన్) వంటి పదార్థాలతోనూ తయారుచేస్తారు. ఈ కీలును ఎక్రిలిక్ సిమెంట్‌తో ఎముకకు అతికిస్తారు. లేదంటే బలంగా నొక్కి ఎముకకు బిగిస్తారు. తర్వాత ఫిజియోథెరపీ ద్వారా ఆ వ్యక్తికి తన కొత్త కీలును కదిలించడం క్రమంగా అలవాటు చేస్తారు.
నడక మునుపటిలా
కీలుమార్పిడి సర్జరీ చేయించుకున్న వారిలో మొదటి మూడు నెలల్లోనే చాలా మార్పు కనిపిస్తుంది. నొప్పి మటుమాయం అవుతుంది. సులువుగా లేచి నిలబడటం, కీళ్లు కదిలించడం సాధ్యపడుతుంది. ఆపైన ఆరు వారాల్లో చాలామంది రోగులు స్వేచ్ఛగా, ఎలాంటి ఆధారమూ లేకుండా నడవగలరు. కండరాలు గట్టిపడిన తర్వాత పరుగెత్తడం, దూకడం మినహా.. అన్ని రోజువారీ పనులనూ సునాయాసంగా చేసుకోగలరు. దాదాపు ఎనభై ఐదు శాతం కృత్రిమ కీలు ఇంప్లాంట్లు ఇరవై సంవత్సరాల వరకూ పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్న కీళ్ల డిజైన్లు, వాటిని అమర్చే విధానాల వల్ల వీటి జీవితకాలం మరింత పెరుగుతూ వస్తున్నది. మోకాలు కీళ్ల మార్పిడి అనేది సంక్లిష్టమైన శస్త్ర చికిత్స. ఇందుకు చేయితిరిగిన ఆర్థోపెడిక్ సర్జన్లతోపాటు రుమటాల జిస్టులు, ఫిజియోథెరపీ నిపుణులు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యసంస్థను ఎంచుకోవాలి. ఆపరేషన్ తర్వాత రోగులు కీళ్లనొప్పి నుంచి విముక్తి పొంది, సాధారణ జీవితం గడపటంలో ఫిజియోథెరపీది చాలా ముఖ్యపాత్ర.
అన్నీ అపోహలే..
మోకీళ్ల సర్జరీ తర్వాత సాధారణ జీవితం గడపటం అసాధ్యమనే వాదనలో అర్థం లేదు. అత్యాధునిక వైద్య పరిశోధనల ఫలితంగా అనేక ఆవిష్కరణలు జరిగాయి. దీంతో మోకీలును తలపించే కృత్రిమ సాధనాలను తయారు చేసుకోగలుగుతున్నాం. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ పుణ్యమాని.. పెద్ద పెద్ద కోతలూ ఉండవు. కాబట్టే, రోజుల్లోనే కోలుకుంటారు. నెలల వ్యవధిలోనే నడవగలుగుతారు. ఇక, బతికినంత కాలం ఫిజియో థెరపీ చేయించుకోవాలనే ప్రచారం వెనుకా శాస్త్రీయత లేదు. నెలల వ్యవధిలోనే పరిపూర్ణ ఆరోగ్యవంతులతో సమానంగా నడవగలుగుతున్నారు. కృత్రిమ అవయవాల తయారీకి ఉపయోగించే లోహాలు అలర్జీ కలిగిస్తాయన్న వాదన అర్థరహితం. శస్త్రచికిత్సకు ఆరోగ్యవంతమైన జీవనశైలి కూడా తోడైతే ఆనందంగా బతికేయవచ్చు. అపోహలతో, అనుమానాలతో, అకారణ భయాలతో శస్త్ర చికిత్సను వాయిదా వేయడం అంటే.. అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవడమే. కాబట్టి, దీర్ఘకాలికంగా మోకాలి నొప్పులు వేధిస్తున్నా, పట్టుమని పది నిమిషాలకు మించి నిలబడలేకపోతున్నా, ఐదారుమెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉన్నా, నొప్పి నివారణ మాత్రలు ఏమాత్రం పనిచేయకపోయినా.. వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఆలస్యమైనకొద్దీ సమస్య సంక్లిష్టంగా మారుతుంది. బతుకు భారంగా అనిపిస్తుంది. అలాంటి జీవితం ఎవరికైనా ఇబ్బందికరమే.
వృద్ధాప్యం సమస్యే కాదు

Joints1
ఎనభై ఐదేండ్ల్ల జయలక్ష్మి దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌వారితో పోరాడారు. క్రమశిక్షణతో జీవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ, ముదిరిన ఆస్టియో ఆర్థరైటిస్ జయలక్ష్మికి సొంతంగా నిలబడలేని, నడవలేని పరిస్థితి కల్పించింది. పదిహేనేండ్లపాటు ఆ మొండి వ్యాధితో పోరాడారామె. చివరికి ఆధునిక శస్త్ర చికిత్సతో కీళ్లనొప్పులపై విజయం సాధించారు. ఆమె మోకాలు కీలు మొత్తాన్ని మార్చివేసే శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ టీకేఆర్) చేయించుకున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా తీవ్రమైన మోకాళ్ల సమస్య ఎదుర్కొంటున్న జయలక్ష్మికి టీకేఆర్ తప్ప ప్రత్యామ్నాయం లేదు. సాధారణంగా బాగా వృద్ధులైన వారికి ఈ సర్జరీ సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. కానీ, అది నిజం కాదు. మొత్తం కీలును మార్చే శస్త్రచికిత్సలో అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో పండు ముసలివారికి కూడా టీకేఆర్ చేయగలుగుతున్నాం.
రోబోటిక్ శస్త్రచికిత్స

Mako Robot
మోకీళ్ల మార్పిడి విషయంలో రోబోటిక్ సాంకేతికత విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. ఈ విధానంలో మరింత సురక్షితంగా, కచ్చితంగా చికిత్స అందించవచ్చు. ఇందులో రోబోటిక్ ఆర్మ్ వైద్యుడి మార్గదర్శకత్వంలో ఆపరేషన్ నిర్వహిస్తారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ విధానంలో నొప్పి తక్కువగా ఉంటుంది. రోగి తొందరగా కోలుకుంటాడు. ఒక్కొక్కరి మోకీళ్లు ఒక్కోలా ఉంటాయి. రోబోటిక్ సాంకేతికత ద్వారా ఎవరికి తగిన విధంగా వారికి శస్త్ర చికిత్స నిర్వహించడం సాధ్యమవుతుంది. ఈ ఫలితాలు ఎక్కువ కాలంపాటు నాణ్యమైన జీవితానికి హామీ ఇస్తాయి.
డాక్టర్ సునీల్ దాచేపల్లి
సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్