Health Tips | ఏ దవాఖానకు వెళ్లినా మూత్రపిండ రోగులే ఎక్కువగా కనిపిస్తారు. భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు కూడా అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సాధారణ వ్యాధుల జాబితాలో చేరే ప్రమాదం లేకపోలేదు. గతంలో వయోధికులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారికే కిడ్నీ వ్యాధులు వచ్చేవి. ప్రస్తుతం ఎవరికి, ఎందుకొస్తున్నాయో తెలియని అయోమయ పరిస్థితి. సమస్య ముదిరిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీస్తున్నది. దీనికి కారణం అవగాహన లోపమే. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారాన్ని ‘ప్రపంచ కిడ్నీ దినం’గా పరిగణిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.
మూత్రపిండాలు శరీరంలో కీలకపాత్ర
పోషిస్తాయి. రోజుకు రెండొందల లీటర్ల నీటిని శుద్ధిచేసే శక్తి వాటికి ఉంది. అత్యాధునిక వాటర్ ఫిల్టర్ కూడా దానిముందు దిగదుడుపే. కానీ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా మనిషి తన మూత్రపిండాల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా వ్యాధి ముదిరిన తర్వాత దవాఖాన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కిడ్నీ సమస్యలు ప్రధానంగా రెండు రకాలు.
1. దీర్ఘకాలిక రుగ్మతలు
ఇవి చాలా నెమ్మదిగా ప్రభావం చూపుతాయి. సమస్య కనీసం మూడు నెలలపాటు ఉంటేనే దాన్ని ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’గా పరిగణిస్తారు. ఈ మందగమనం వల్ల వ్యాధి లక్షణాలు వెంటనే బయటపడవు. దీంతో చివరి దశకు చేరుకున్న తరువాతే రోగి అప్రమత్తం అవుతాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది.
2. తాత్కాలిక రుగ్మతలు
‘ఎక్యూట్ కిడ్నీ డిసీజెస్’లో వ్యాధి అకస్మాతుగా మొదలవుతుంది. అతివేగంగా విస్తరిస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ దాపురించినప్పుడు, హఠాత్తుగా రక్తపోటు పడిపోయినప్పుడు కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీనివల్ల వాటి పనితీరు దెబ్బతింటుంది. ఈ సమస్యను ఏటీఎన్ (ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్) అని పిలుస్తారు. కొన్ని ఔషధాల ప్రభావం వల్ల కూడా కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లు పడటం వల్ల, మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మూత్రపిండంలోని ‘పాపిలా’ అనే భాగం ఊడిపోయి కిడ్నీ ట్యూబ్‌లో అడ్డం పడుతుంది. ఫలితంగా, ఆ వడపోత వ్యవస్థ సామర్థ్యం దెబ్బతింటుంది. కిడ్నీలోని ఫిల్టర్లు (గ్లోమెరులార్స్) వాపునకు గురైనప్పుడు ‘గ్లోమెరులోనెఫ్రైటిస్’కు గురవుతారు. దీనివల్ల కూడా కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది.
ముఖ్య కారణాలు
కిడ్నీ సమస్యలకు మూల కారణాలను మూడు రకాలుగా విభజిస్తారు.
రీనల్ కాజెస్
మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్తోపాటు వివిధ ఔషధాల ప్రభావంతో ఉత్పన్నమైన సమస్యలను.. ‘రీనల్ కాజెస్’ అంటారు.
ప్రీ రీనల్ కాజెస్
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, వాంతులు, విరేచనాలు వంటివి ఇబ్బంది పెట్టినప్పుడు, గుండె, కాలేయం పనితీరు మందగించినప్పుడు.. కిడ్నీల పనితీరు చురుగ్గా ఉండదు. కిడ్నీలకు రక్త సరఫరా తగ్గినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. ఈ పరిస్థితులను ‘ప్రీ రీనల్ కాజెస్’ అంటారు.
పోస్ట్ రీనల్ కాజెస్
కిడ్నీలో రాళ్లు పడటం, బ్లాడర్‌లో రాళ్లు అడ్డం పడి మూత్ర ప్రసరణ తగ్గిపోవడమే కాదు.. మూత్రం వెనక్కి వెళ్లిపోయి ఒత్తిడి పెరగడం వల్ల కూడా సహజంగానే కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. వీటినే ‘పోస్ట్ రీనల్ కాజెస్’ అంటారు. ప్రొస్టేట్ సమస్య వల్ల మూత్ర ప్రసరణ తగ్గిపోయి, వ్యర్థాలన్నీ బ్లాడర్‌లో నిలిచిపోయి.. కిడ్నీలపై భారం పడటం కూడా ఓ కారణమే.
అతను వర్సెస్ ఆమె
లింగభేదంతో సంబంధం లేకుండా ఎవరికైనా కిడ్నీ సమస్యలు రావచ్చు. కాకపోతే ఆ వ్యాధి స్త్రీ, పురుషులను వేరువేరుగా ప్రభావితం చేస్తుంది. పురుషుల విషయంలో మూత్రపిండ వ్యాధుల వల్ల కిడ్నీలు త్వరగా పాడవుతాయి. హార్మోన్ స్థాయిలో మార్పు (టెస్టోస్టిరాన్), అనారోగ్యకర జీవన విధానం (పొగ, ఊబకాయం) తదితర కారణాల వల్ల పురుషుల్లో వ్యాధి వేగంగా ముదిరిపోయి.. కిడ్నీలు దెబ్బతినే ఆస్కారం ఉంది.
అదే మహిళల విషయంలో ఇంత వేగం ఉండదు. అయితే మహిళలు రోగ నిర్ధారణ పరీక్షలకు ముందుకు రావడం తక్కువ కాబట్టి, వారిలో సమస్య ఆలస్యంగా బయటపడుతుంది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల విషయానికి వస్తే .. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్కువగా పురుషుల్లోనే జరుగుతుంది. కానీ, ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తరువాత.. ఆ మార్పిడి చేసిన కిడ్నీలు ఎక్కువ రోజులు పనిచేసేది మాత్రం మహిళలకే.
Kidney
ప్రధాన లక్షణాలు
వ్యాధి స్వభావాన్ని బట్టి లక్షణాలు మారిపోతూ ఉంటాయి. ‘ఎక్యూట్’ బాధితుల విషయానికొస్తే.. మూత్రం తక్కువగా వస్తుంది. కాళ్లలో, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆయాసం, దగ్గు ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు. వాంతులు అవుతున్నట్టు ఉంటుంది. తీవ్రమైన నీరసం. తరచూ అయోమయానికి గురవుతారు. కోమాలోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఎక్యూట్ బాధితులైతే.. కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న తరువాత.. అదీ చివరిదశలో బయటపడతాయి. దీంతో వ్యాధులను గుర్తించడం కొంత కష్టం.
అప్పుడే డయాలసిస్
కిడ్నీ పనితీరు పదిశాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు రోగికి డయాలసిస్ తప్పదు. అంతేకాదు, హఠాత్తుగా మూత్రం నిలిచిపోయినప్పుడు, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆయాసం అనిపిస్తుంది. శరీరంలో యాసిడ్స్, పొటాషియం పెరిగినప్పుడు కిడ్నీ పనితీరుతో సంబంధం లేకుండా రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి డయాలసిస్ మొదలైతే.. జీవితాంతం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. తాత్కాలిక రుగ్మతలైతే.. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు డయాలసిస్ చేస్తే సరిపోతుంది. కిడ్నీ పనితీరు మెరుగైన తరువాత డయాలసిస్ నిలిపేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల్లో జీవితాంతం చేయాల్సి ఉంటుంది.
జాగ్రత్త.. జాగ్రత్త
కిడ్నీ రోగులలో ఓ పట్టాన వ్యాధి లక్షణాలు బయటపడవు. కాబట్టి, సంవత్సరానికి ఒకసారైనా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), సీరం క్రియాటిన్, జీఎఫ్ఆర్ (గ్ల్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్- ఈ పరీక్ష కిడ్నీ పనితీరును తెలియచేస్తుంది)తోపాటు బీపీ, షుగర్ తదితర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండేలా జాగ్రత్త
పడాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. పెయిన్ కిల్లర్స్, సప్లిమెంట్స్ వంటివి సాధ్యమైనంత మేర తగ్గించాలి.
?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ జ్యోత్స్న గుత్తికొండ
నెఫ్రాలజి విభాగాధిపతి
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్