Jamun Seeds Powder | మధుమేహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి శరీర భాగాలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. అందుకే డయాబెటిస్ నియంత్రణలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన పదార్థాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో నేరేడు గింజల పొడి (జామున్ సీడ్ పౌడర్) ఒకటి. నేరేడు గింజల పొడిలో జాంబోలిన్, జాంబోసిన్ అనే క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారే వేగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో భోజనం తర్వాత ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే నేరేడు గింజల్లో ఉండే బయోఆక్టివ్ ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీర కణాలు గ్లూకోజ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను రక్షించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. నేరేడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థలో చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఉపవాస సమయంలోనూ, భోజనం అనంతరం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు మేలు చేసే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.
ఇక నేరేడు గింజల పొడిని వాడే విధానం కూడా చాలా ముఖ్యం. మొదట్లో రోజుకు అర టీస్పూన్ లేదా ఒక టీస్పూన్ పరిమాణంలో గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. అలాగే భోజనానికి అరగంట ముందు కొద్దిపాటి పొడిని నీటితో తీసుకుంటే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయని సూచిస్తున్నారు. ఈ పొడిని సలాడ్లు, పెరుగు, స్మూతీలు లేదా ఓట్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే దీని ప్రయోజనాలు కనిపించాలంటే నిరంతరం పరిమిత మోతాదులో తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోనే నేరేడు గింజల పొడిని తయారు చేసుకోవచ్చు. ముందుగా గింజలను శుభ్రంగా కడిగి, 3 నుంచి 7 రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తరువాత పైపొర తీసి లోపలి గింజను పొడిగా చేసుకుని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. అయితే నేరేడు గింజల పొడి మధుమేహ నియంత్రణకు సహాయకరంగా ఉంటుందని చెప్పినా, ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే దీనిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.