Jackfruit | పనస పండ్లను చాలా మంది చూసే ఉంటారు. రహదారులపై బండ్ల మీద ఈ పండ్లను ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఈ పండ్లు మరీ తియ్యని వాసనను కలిగి ఉంటాయి. కనుక వీటి వాసన చాలా మందికి నచ్చదు. అయితే పనస పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. పనస పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. పనస పండ్లతో చాలా మంది అనేక రకాల వంటలను కూడా చేస్తుంటారు. ముఖ్యంగా పనస పొట్టు, గింజలు, తొనలను ఉపయోగించి భిన్న రకాల వంటలను చేస్తుంటారు. పనస తొనలు తియ్యని రుచిని కలిగి ఉంటాయి. కనుక చాలా మంది ఈ తొనలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పనస తొనల్లో ఫైబర్, విటమిన్లు ఎ, సి, పలు రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో పొటాషియం, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం, జింక్, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. వీటి వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటాం. పనస తొనలను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి పనస తొనలు ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనకునే వారు ఈ తొనలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఈ తొనలను తినడం వల్ల వీటిల్లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అనవసరంగా ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పనస పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీని వల్ల తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
పనస పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది వాసొడైలేటర్గా పనిచేస్తుంది. అంటు రక్తనాళాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. పనస పండ్లలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరం క్యాల్షియంను శోషించుకునేలా చేస్తాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. పనస పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. దీంతో వృద్ధాప్యంలోనూ కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వృద్ధాప్య ఛాయలు అసలు కనిపించవు.
పనస పండ్లను తినడం వల్ల శరీరంలో మెగ్నిషియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరంలో న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయిలు పెరుగుతాయి. ఇవి నిద్రను కలగజేస్తాయి. కనుక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు తరచూ పనస పండ్లను తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇక పనస పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. వీటిని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. పైగా పనస పండ్లను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. ఇలా పనస పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తినడం మరిచిపోకండి.