Itchy Scalp | ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చుండ్రు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏం చేసినా కూడా చుండ్రు తగ్గడం లేదని వాపోతున్నారు. దీంతోపాటు జుట్టు అంతా దురదగా ఉంటుంది. పదే పదే జుట్టును గోళ్లతో గీరుతుంటారు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే తలలో దురద వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. చుండ్రు ఉండడం, పీహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి కారణంగా వాపులకు గురవడం, హార్మోన్ల సమస్యలు, పేలు ఎక్కువగా ఉండడం, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా తలలో అలా మాటి మాటికీ దురద వస్తుంటుంది. కొందరికి ఈ సమస్య రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది. అలాగే చెమట పట్టినా కూడా దురద పెడుతుంది.
మీకు తలలో దురద సమస్య ఉన్నా లేదా ఇంట్లోని ఎవరికైనా ఈ సమస్య ఉన్నా వారు ఉపయోగించే దువ్వెనలను వాడకూడదు. ఎవరి దువ్వెనను వారే వాడాలి. లేదంటే ఈ సమస్య ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్రష్‌లు, టోపీలు, దిండ్లు లేదా దిండ్ల కవర్లు వంటి వాటిని కూడా ఒకరివి మరొకరు వాడకూడదు. ఇక తలలో దురదను తగ్గించేందుకు అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల జుట్టు పొడిగా మారదు. తేమగా ఉంటుంది. దురద రాకుండా అడ్డుకోవచ్చు. ఇందుకు గాను కొద్దిగా కలబంద గుజ్జును జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలలో దురద అనే సమస్య ఉండదు. అలాగే చుండ్రు కూడా పోతుంది.
జుట్టు కుదుళ్ల వద్ద చుండ్రు పొట్టులా వస్తుంటుంది. అయితే దీన్ని దువ్వెనతో తొలగిస్తుండాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు ఏర్పడదు. ఇలా చేయడం వల్ల తలలో దురద కూడా రాకుండా అడ్డుకోవచ్చు. లేదంటే చుండ్రు అక్కడే ఉండి ఇబ్బందులను సృష్టిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను కాస్త తీసుకుని నీటిలో కలిపి జుట్టుకు పట్టించాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తలలో చుండ్రు తగ్గడమే కాకుండా దురద కూడా పోతుంది. అలాగే పెరుగు, కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది చక్కని హెయిర్ మాస్క్‌లా పనిచేస్తుంది. సమస్యలను తగ్గిస్తుంది. వారంలో ఒక రోజు నిమ్మరసం రాయాలి. అలాగే పెప్పర్మింట్, టీ ట్రీ, జొజొబా, నీమ్, లెమన్ గ్రాస్ వంటి ఆయిల్స్‌ను కూడా జుట్టుకు రాస్తుండాలి. ఇవన్నీ చుండ్రును తగ్గించడంతోపాటు తలలో ఉండే దురదను పోగొడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఏదైనా ఆయిల్‌ను వాడినప్పుడు నేరుగా దాన్ని ఉపయోగించకూడదు. అందులో కాస్త కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాయాలి. కనీసం 2 నుంచి 3 గంటలపాటు ఉండాలి. తరువాతే తలస్నానం చేయాలి. లేదా ముందు రోజు రాత్రి జుట్టుకు నూనెను రాసి మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు. ఇలా చేస్తుంటే తలలో దురద ఉండదు. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతుంది. కొందరు మరీ చల్లని నీటితో లేదా కొందరు మరీ వేడి నీటితో తలస్నానం చేస్తారు. ఇలా చేయడం జుట్టుకే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీటినే స్నానానికి ఉపయోగించాలి. అలాగే తల పూర్తిగా ఆరిన తరువాతే దువ్వెన వాడాలి. లేదంటే జుట్టు రాలుతుంది. ఇలా పలు చిట్కాలను పాటిస్తే జుట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి.