Water Drinking | మన శరీరానికి నీరు చాలా అవసరం. నీరు మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మెదడు పనితీరుకు, కీళ్ల కదలికలకు, వ్యర్థాల తొలగింపుకు, పోషకాల రవాణాకు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి, శక్తికి, శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండడానికి నీరు ఎంతో అవసరం. పురుషులు రోజుకు 3 లీటర్లు ( సుమారు 13 కప్పులు), స్త్రీలు 2 లీటర్ల కంటే ఎక్కువ ( దాదాపు 9 కప్పులు) నీటిని తాగాలి. అలాగే మన జీవనశైలి, మనం చేసే విధులను బట్టి మన శరీర నీటి అవసరాలు మారుతూ ఉంటాయి. వ్యాయామం చేసే వారు, ఎండలో ఎక్కువగా పని చేసే వారు నీటిని ఎక్కువగా తాగాల్సి వస్తుంది. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. నీటిని తక్కువగా తాగడం వల్ల మన శరీరం వివిధ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటిని తక్కువగా తాగడం వల్ల క్రమంగా అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. నీటిని తక్కువగా తాగడం వల్ల మన శరీరం ఎదుర్కొనే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిని తక్కువగా తాగడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పితో బాధపడే వారికి వైద్యులు కూడా నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. గాలి, ఎండ వల్ల మాత్రమే కాకుండా శరీరంలో డీహైడ్రేషన్ వల్ల కూడా పెదవులు పగులుతాయి. లిప్‌బామ్ వంటి వాటిని వాడడంతో పాటు నీటిని ఎక్కువగా తాగడం వల్ల పెదవులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కొన్నిసార్లు తక్కువ రక్తపోటుకు నీరు కూడా కారణం కావచ్చు. డీహైడ్రేషన్ కారణంగా కూడా రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో నీటిని తాగడం వల్ల రక్తపోటు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. నీటిని తక్కువగా తాగడం వల్ల కండరాల సమస్యలు కూడా వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు సంభవిస్తాయి. అలాగే వాతావరణం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు శరీరం చల్లబడడానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది. అలాంటి సమయంలో మనం నీటిని తక్కువగా తాగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. జ్వరం, వికారం, మూర్చపోవడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా నీటిని తక్కువగా తాగడం వల్ల చక్కెర ఎక్కువగా తీసుకోవాలి అనే కోరికలు కలుగుతాయి.
తగినంత నీరు తాగనప్పుడు మెదడుకు ఆక్సిజన్ లభించదు. దీని వల్ల తలతిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆకలి తగ్గడం వంటివి మాత్రమే చికాకుకు కారణాలు కావు. తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా చికాకుకు గురి అవుతారు. ఎక్కువగా శీతాకాలంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి కారణంగా అలసటకు గురి అవుతారని భావిస్తారు. కానీ శరీరంలో డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో మనం త్వరగా అలిసిపోతాం. ఇక నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మూత్రం ముదురు పసుపు రంగులో రావడంతో పాటు మూత్రంలో మంట వంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మాత్రమే కాదు నీటిని తక్కువగా తాగడం వల్ల కూడా మలబద్దకం సమస్య వస్తుంది. మలవిసర్జన సమయంలో ఇబ్బంది, మలం గట్టిగా రావడం, కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు కూడా వస్తాయి.
నీటిని తక్కువగా తాగడం వల్ల నోటిలో ఇన్పెక్షన్ లు, కావిటీస్, నోరు దుర్వాసన రావడం జరుగుతుంది. చర్మ కణాలు ఎక్కువగా నీటితో తయారవుతాయి. నీరు తక్కువగా తాగడం వల్ల చర్మం పొడిబారడం, చర్మం ముడతలు పడినట్టుగా కనిపించడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నీటిని తక్కువగా తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు సరిగ్గా విసర్జించబడవు. దీంతో తరచూ అనారోగ్యానికి గురి అవడం, ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురి అయితే బ్యాక్టీరియా, వైరస్ ల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కష్టమవుతుంది. నీటిని తక్కువగా తాగడం వల్ల ఇలా అనేక దుష్ప్రభావాలను మన శరీరం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక రోజూ మన శరీర అవసరాలకు తగినట్టు నీటిని తాగడం చాలా అవసరం.