Iron Deficiency Symptoms | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అసలు చాలా మందికి తమకు ఐరన్ లోపం ఉన్నట్లే తెలియడం లేదు. దీన్ని తెలుసుకోలేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఇది అనేక వ్యాధులకు దారి తీస్తోంది. అయితే ఐరన్ లోపిస్తే మన శరీరం పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా మన శరీరంలో ఐరన్ లోపిందని అర్థం చేసుకోవచ్చు. దీంతో తగిన విధంగా చికిత్స తీసుకోవడం, డైట్‌ను పాటించడం చేస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. లేదంటే దీర్ఘకాలంలో ఇది ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ఇక ఐరన్ లోపిస్తే మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ లోపిస్తే సహజంగానే చాలా మందికి తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చిన్న పనిచేసినా అలసి పోతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఐరన్ లోపం ఉందేమోనని అనుమానించాలి.
ఐరన్ లోపం ఉంటే రక్తం తగినంత తయారు కాదు. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు తెల్లగా మారుతుంది. ముఖ్యంగా చేతులు, పాదాల వేళ్లు, పెదవులు, కను రెప్పలు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నా కూడా ఐరన్ లోపం ఉందని తెలుసుకోవాలి. ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ లక్షణం కూడా ఐరన్ లోపాన్ని తెలియజేస్తుంది.
ఐరన్ లోపం ఉన్నవారికి తరచూ చల్లని పదార్థాలను తినాలనిపిస్తుంది. అయితే ఈ లక్షణం అందరిలోనూ కనిపించకపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాన్నే ఫాగోఫేజియా అని కూడా పిలుస్తారు. వీరికి ఎంత సేపు చల్లని పదార్థాలు లేదా ఐస్‌ను తినాలని కోరికగా ఉంటుంది. ఇది కూడా ఐరన్ లోపం ఉందని చెప్పేందుకు సంకేతమే. ఐరన్ లోపం ఉంటే గోర్లు బలహీనంగా మారి చిట్లిపోతాయి. గోర్ల చివర్లు ఊరికే విరిగిపోతుంటాయి. దీన్నే కోయిలానైకియా అంటారు. గోర్లకు పోషకాలు సరిగ్గా లభించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
ఐరన్ లోపిస్తే నోట్లోని కణాలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందవు. దీంతో నోట్లో అంతా పుండ్లు లేదా అల్సర్ల మాదిరిగా తయారవుతాయి. నాలుకపై పొక్కులు వస్తుంటాయి. పెదవుల లోపలి వైపు పుండ్లు ఏర్పడుతుంటాయి. ఐరన్ లోపించడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దగ్గు, జలుబు సమస్యలు ఒక పట్టాన తగ్గవు. ఒక వేళ తగ్గినా నాలుగైదు రోజులు విరామం ఇచ్చి మళ్లీ వస్తుంటాయి. ఐరన్ లోపిస్తే చేతులు, కాళ్లకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీంతో ఆయా భాగాల్లో ఎల్లప్పుడూ చల్లదనం ఉంటుంది. ఇలా మన శరీరం మనకు ఐరన్ లోపిస్తే పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. వీటిని గుర్తిస్తే ముందుగానే తగిన చికిత్స తీసుకోవచ్చు. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు.