Iodine Deficiency | మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో మినరల్స్ కూడా ఒకటి. వీటిల్లో చాలా ఉంటాయి. ఇక మినరల్స్‌లో అయోడిన్ కూడా ముఖ్యమైనదే. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు, ఇతర అవయవాలకు మనకు అయోడిన్ అవసరం అవుతుంది. అయోడిన్ లోపిస్తే మన శరీరం పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా మన శరీరంలో అయోడిన్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక అయోడిన్ లోపం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అయోడిన్ లోపిస్తే శరీరం చల్లగా మారుతుంది. అంతేకాదు వాతావరణం ఎంత వేడిగా ఉన్నప్పటికీ దుప్పటి కప్పుకోవాలన్నంత చలిగా అనిపిస్తుంది.
అయోడిన్ మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది లోపిస్తే శరీరం చలిని తట్టుకోలేదు. దీంతో కొందరికి వణికినట్లు కూడా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తుంటే అయోడిన్ లోపం ఉన్నట్లు గుర్తించాలి. మీ చర్మం తరచూ పొడిబారుతుందా, దురద పెడుతుందా.. ఎంత మాయిశ్చరైజర్‌ను అప్లై చేసినా ఫలితం ఉండడం లేదా.. అయితే మీకు అయోడిన్ లోపం ఉండి ఉంటుంది. అయోడిన్ లోపిస్తే చర్మం తేమను కోల్పోతుంది. దీంతో ఎంత మాయిశ్చరైజర్‌ను అప్లై చేసినా కూడా చర్మం పొడిగానే మారి దురద పెడుతుంది. ఈ లక్షణం కనిపించినా కూడా అయోడిన్ లోపం ఉన్నట్లు తెలుసుకోవాలి.
కొందరు రాత్రంతా సరిగ్గానే నిద్రపోయినా ఉదయం నిద్ర లేవగానే తీవ్రంగా అలసిపోయినట్లు, నీరసం వచ్చినట్లు మారిపోతారు. అయితే ఇందుకు అయోడిన్ లోపం కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అయోడిన్ మన శరీరంలో శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది. మనకు శక్తిని అందించేందుకు అయోడిన్ అవసరం. అది లోపిస్తే శక్తి లేనట్లు అనిపిస్తుంది. కనుకనే ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసట, నీరసం ఉంటాయి. ఈ రెండు లక్షణాలు ఉంటే దాన్ని కూడా అయోడిన్ లోపంగా భావించాలి. అలాగే మీ మెడ లేదా గొంతు భాగంలో ఏదైనా కొవ్వు గడ్డలా వచ్చిందా..? అయితే ఇది అయోడిన్ లోపం వల్లనే అని గుర్తించాలి. మన శరీరంలో తగినంతగా అయోడిన్ లేకపోతే ఇలాంటి కొవ్వు గడ్డలు ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ గ్రంథి మన శరీర మెటబాలిజంను నియంత్రించాలంటే అందుకు అయోడిన్ అవసరం అవుతుంది. అయోడిన్ లోపిస్తే మెటబాలిజం సరిగ్గా ఉండదు. దీంతో గొంతు లేదా మెడపై కొవ్వు గడ్డలు ఏర్పడుతుంటాయి. ఈ లక్షణం కూడా అయోడిన్ లోపం ఉంటేనే కనిపిస్తుంది.
శరీరంలో అయోడిన్ లోపిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. పనిపై లేదా ఇతర విషయాలపై ధ్యాస ఉండదు. బద్దకంగా ఉంటారు. మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. చికాకుగా ఉంటుంది. ఇక మహిళల్లో అయోడిన్ లోపం ఉంటే నెలసరి సరిగ్గా రాదు. లేదా పీరియడ్స్ టైముకు రావు. నెలసరిలోనూ కొందరికి తీవ్ర రక్త స్రావం అవుతుంది. కొందరికి మాటి మాటికీ రక్త స్రావం అవుతూనే ఉంటుంది. అలాగే అయోడిన్ లోపం జుట్టుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో జుట్టు బలహీనంగా మారి పలుచబడుతుంది. జుట్టు రాలిపోతుంది. ఇలా అయోడిన్ లోపం ఉంటే పలు లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. దీంతో డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు.