Soya Milk | రోజూ పాలను తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుందని కూడా తెలుసు. అందుకనే చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు చాలా మంది రోజూ పాలు తాగుతుంటారు. పాలను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అన్ని రకాల పోషకాలు పాలలో ఉంటాయి. తల్లిపాల తరువాత గేదె పాలు లేదా ఆవు పాలలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోయా పాల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది. ఈ క్రమంలోనే సోయా పాలకు చెందిన పలు నిజాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
సోయా పాలను విదేశీయులు తయారు చేశారని అనుకుంటారు. కానీ సోయా పాలను ముందుగా ఆసియాలోనే తయారు చేశారు. సోయాపాలు ముందుగా చైనాలో తయారైనట్లు చరిత్ర చెబుతోంది. తోఫును తయారు చేసినప్పుడు వచ్చే ద్రవాన్ని అప్పట్లో పడేసేవారట. కానీ అందులోనూ పోషకాలు ఉంటాయని, దాన్ని తాగవచ్చని తెలిశాక అప్పటి నుంచి ఆ ద్రవాన్ని తాగడం, ఇతర ఆహారాల్లో వాడడం మొదలు పెట్టారు. అలా ఆ ద్రవమే సోయాపాలుగా మారింది. ప్రస్తుతం చాలా మంది సోయా పాలను తాగేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు పాలను సరఫరా చేయడం కష్టతరమైంది. దీంతో పలు దేశాల వారు తమ సైనికులకు సోయాపాలను సప్లై చేశారు. వాస్తవ పాలతో పోలిస్తే సోయా పాలలోనూ అదే రకమైన పోషకాలు ఉంటాయని తెలిసి సోయా పాలను వాడడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ పాల వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ వాసులు అప్పటి నుంచి సోయా పాలను వాడడం మొదలు పెట్టారు.
కొందరికి పాలంటే అలర్జీ ఉంటుంది. జంతు సంబంధ పదార్థాలను తీసుకునేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. అలాంటి వారు సోయా పాలను సేవించవచ్చు. సోయా పాలు సాధారణ పాల కన్నా భిన్నమైనవి. కనుక సాధారణ పాల పట్ల అలర్జీ ఉన్నవారు సోయా పాలను సేవించాలని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. సోయాపాలలోనూ సాధారణ పాలలాగే అనేక పోషకాలు ఉంటాయి.
కొందరు బేకరీ పదార్థాలను తయారు చేసేందుకు సోయా పాలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సోయా పాలతో పలు రకాల ఆహారాలను తయారు చేస్తారు. సోయా పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ పాలను బేకరీ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక సోయా పాలను ఎలా తయారు చేస్తారు.. ఇవి ఖరీదు ఉంటాయా.. అని చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే సోయాపాలను మీరు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. సోయా గింజలను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని బ్లెండర్లో వేసి పట్టుకోవాలి. దీంతో పాలు వస్తాయి. వాటిని వడకట్టి మరిగించుకోవాలి. దీంతో వాటికి ఉండే బీన్స్ వాసన పోతుంది. ఇలా సోయా పాలను ఎవరైనా సరే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సోయా పాలను తాగడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.