Chronic snoring | గురక.. మనలో చాలా మంది ఇళ్లలో ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇది బాధితుడితోపాటు ఇంట్లో వాళ్లను కూడా ఇబ్బంది పెడుతుంది. గురక సాధారణమని అనుకుంటే పొరపాటు. అంగిలిలోని మెత్తని భాగం ప్రకంపనలకు లోనైన సందర్భాల్లో వచ్చే శద్ధమే గురక. కొందరిలో గాలి మార్గాలను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేసి నిద్రలేమికి కారణంగా మారుతుంది. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనం గురక పెడుతున్నట్లు మనకు తెలియదు. కానీ, మన పక్కన నిద్రించే వారికి నరకం చూపిస్తుంది. ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు రాత్రి గురక పెడుతున్నట్లు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు గురక వస్తే ఏం ఇబ్బంది లేదు కానీ, గురక దీర్ఘకాలం పాటు కొనసాగితే మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా కాలం పాటు గురక వేధిస్తున్నట్లయితే ఆరోగ్య సమస్యలు రాకముందే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
దీర్ఘకాలిక గురక అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే దీర్ఘకాలిక స్థితికి సంకేతం. ఇది శరీరంలోని ఇతర భాగాలపై ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండెపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. గురక పెట్టే వారందరికీ స్లీప్ అప్నియా ఉండకపోవచ్చు. అయితే ఎవరైనా ఉక్కిరిబిక్కిరి చేయడం, గురక, నిద్రలేమి, పగటిపూట నిద్రపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది. స్లీప్ అప్నియాతో దీర్ఘకాలిక గురక ఊపిరితిత్తులు, గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. ఇది కంట్రోల్ చేయలేనంత రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో పాటు పనిలో ఆసక్తి లేకపోవడం, రోడ్డు దాటడంలో బద్దకం వంటి వాటితో ప్రమాదాలకు దారితీస్తుంది.
గుండెపై ప్రభావం
పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, హై హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ బీట్ సక్రమంగా లేకపోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది. స్థూలకాయం, క్రమంగా లేని నిద్ర అలవాట్లు, దవడల్లో అసాధారణత, పిల్లలలో దీర్ఘకాలిక అడినాయిడ్స్, టాన్సిలిటిస్ ఈ వ్యాధికి ముఖ్యమైన కారణ కారకాలు. ఎగువ శ్వాసనాళంలో గాలి మార్గాలు ఇరుకైనప్పుడు వచ్చే గురక కారణంగా ఊబకాయం సమస్యను తెచ్చిపెట్టడంతోపాటు గుండె, ఊపిరితిత్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
నిద్ర సంబంధ సమస్యలు
గురక పెట్టినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది తీవ్రంగా ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక ఉద్రేకం ఏర్పడటంతోపాటు నిద్రకు భంగం కలుగుతుంది. తరచుగా అలసిపోవడం, నీరసంగా మారడం, నిద్రతో ఉన్నట్లు కనిపిస్తారు. ఈ సమస్య వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి ఆటంకాలు కలిగిస్తుంది.
గురకను ఇలా నియంత్రించుకుందాం..
గురక నుంచి బయటపడలేరనేది ఒక అపోహ మాత్రమే. సరైన క్లినికల్ విధానం, చికిత్సతో గురకను దూరం చేయడం సాధ్యమవుతుంది. గురక సమస్యకు పరిష్కారంగా కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ పరికరాలు, బిల్వెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ పరికరాల వంటివి దొరుకుతున్నాయి. ఇవి మనం నిద్రిస్తున్నప్పుడు బాగా ఊపిరి పీల్చుకోవడంలో సాయపడుతుంది. గురకను తగ్గిస్తుంది. గురక కారణాల ఆధారంగా కొందరికి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. అలాగే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన భంగిమలను పాటించడం, అలెర్జీలకు చికిత్స తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను పెంచుకుని గురక సమస్యను తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.