హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ): అఖిల భారత కిసాన్ సంఘ్(ఏఐకేఎస్) ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి(90) సోమవారం ఉదయం కన్నుమూశారు. వయోభారం, శ్వాసకోశ సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే పెద్ద కుమార్తెను అనారోగ్యంతో మృతిచెందారు. మల్లారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం సికింద్రాబాద్ గాంధీ దవాఖాన వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.
వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టు సీపీఎం పార్టీ వర్గాలు వెల్లడించాయి. మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని నిమ్స్‌లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రైతు కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి సందర్శించి, నివాళులర్పించారు.
మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు నాగయ్య, సాగర్, పశ్య పద్మ, చాడ వెంకట్‌రెడ్డి సంతాపం తెలిపారు.
సారంపల్లి అంతిమయాత్రకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, అఖిల భారత కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, నాయకులు కృష్ణ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, తదితరులు హాజరవుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం తిమ్మంపేటలో జన్మించిన మల్లారెడ్డి ..1971 వరకు తిమ్మంపేట పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1973లో నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా మొదలైన ఆయన ప్రయాణం వివిధ హోదాల్లో కొనసాగింది. ప్రజా పోరాటాలతో పాటు సాగునీరు, రైతు సమస్యలపై అనేక పుస్తకాలు రాశారు. రైతు ఉద్యమ చరిత్ర 1947-2007 (2008), బడుగు రైతుల వెతలు (2008), కమీషన్లు-రెకమండేషన్లు (2014), కార్పొరేట్ దిశన వ్యవసాయం (2013), రాష్ట్రంలో నదీజలాలు – ప్రాజెక్టులు – వివాదాలు (2013), తెలంగాణలో సాగునీటి వనరులు -అవకాశాలు (2015), తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు (2016), వ్యవసాయ సంక్షోభంలో రైతులు దివాళా – అత్యంత ధనిక రాష్ట్ర జపం (2018), సహకార రుణాలు (2003), భారత రైతాంగ పోరాటాలు (2020), తదితర 20కి పైగా పుస్తకాలను రచించారు.
మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ నాగయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ఉద్యమ నిర్మాణంలో మల్లారెడ్డి తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ జంగారెడ్డి, కోశాధికారి మూడ్ శోభన్, సహాయ కార్యదర్శి వెంకట్ మావో, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ ప్రసాద్, బొప్పని పద్మ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఐతే విజయ్, ఆంజనేయులు, శివ విజయ్, తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధత కలిగిన రైతు ఉద్యమనేత మల్లారెడ్డి.. ఆయన మరణం విచారకరం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ): జీవితమే పోరాటంగా భావించి ప్రతిక్షణం వ్యవసాయరంగ అభివృద్ధికి పరితపించిన సారంపల్లి మల్లారెడ్డి నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణంపై సోమవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. అఖిల భారత రైతు సంఘం, కమ్యూనిస్ట్ నేతగా రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేసుకున్నారు. మల్లారెడ్డి మరణం భారత రైతాంగ ఉద్యమానికి తీరని లోటని అభివర్ణించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.