Loss Of Smell | సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మరీ చల్లని పదార్థాలను తీసుకున్నప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అయితే దగ్గు, జలుబు ఉంటే చాలా వరకు మన ముక్కు కూడా సరిగ్గా పనిచేయదు. వాసన చూసే శక్తిని కోల్పోతుంది. దీంతో ఆహారాలను తినాలనిపించదు. వాటి వాసన తెలియక వాటి రుచిని ఆస్వాదించలేకపోతాం. అయితే దగ్గు, జలుబు లేకపోయినా కొందరికి ముక్కు వాసనను చూసే శక్తిని కోల్పోతుంది. కరోనా సమయంలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి సమస్య అనేక మందికి వస్తోంది. అయితే దీన్నే వైద్య పరిభాషలో అనోస్మియా అంటారు. ముక్కు తాత్కాలికంగా వాసన చూసే శక్తిని కోల్పోవడాన్నే అనోస్మియా అని వ్యవహరిస్తారు. అయితే ఈ సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. 2 నిమిషాల పాటు నీటిని మరిగించాక అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో ముక్కుకు వాసన చూసే శక్తి తిరిగి వస్తుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా తేనె కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. దీని వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా ఆముదాన్ని కొద్దిగా వేడి చేసి దాన్ని ఒక్క చుక్క మోతాదులో రెండు నాసికా రంధ్రాల్లోనూ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే తిరిగి అన్నింటినీ వాసన చూడగలుగుతారు.
ఈ సమస్యను తగ్గించేందుకు పుదీనా ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. ఇందుకు గాను పది లేదా పదిహేను పుదీనా ఆకులను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి. ఇలా చేస్తుంటే ముక్కు తిరిగి వాసన చూసే శక్తిని పొందుతుంది. అలాగే అల్లం కూడా ఈ సమస్యకు పనిచేస్తుంది. ఒక అల్లం ముక్కను తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగాలి. కోల్పోయిన వాసన శక్తి తిరిగి వస్తుంది. అలాగే వాము గింజలను నీటిలో వేసి మరిగించి రోజుకు 2 సార్లు తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
ముక్కు కోల్పోయిన వాసన శక్తిని తిరిగి రప్పించేందుకు జీలకర్ర కూడా అద్భుతంగానే పనిచేస్తుంది జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో సేవిస్తుండాలి. దీంతో ఎంతగానో ఉపయోగం ఉంటుంది. పలు ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఉసిరికాయలను రోజుకు ఒకటి చొప్పున తింటుంటే ఫలితం ఉంటుంది. స్ట్రాబెర్రీలు, నారింజలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి వాటిని తింటుంటే ఈ సమస్య తగ్గుతుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే ముక్కు కోల్పోయిన వాసన శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.