Cancer Symptoms | ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. క్యాన్సర్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన దేశంలో చాలా మంది గుట్కా, కైనీ నమలడం, పొగ తాగడం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే గొంతు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కూడా చాలా మందికి వస్తోంది. అయితే క్యాన్సర్ ప్రారంభంలో ఉంటే పలు లక్షణాలను మన శరీరం తెలియజేస్తుంది. దీంతో అప్రమత్తమై ముందుగానే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే కొందరికి క్యాన్సర్ లక్షణాలు అంత సులభంగా కనిపించవు. కానీ కొందరిలో మాత్రం ఈ లక్షణాలు రోజూ ఉదయం కనిపిస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా క్యాన్సర్ ఉందీ లేనిదీ గుర్తు పట్టవచ్చు. ముఖ్యంగా మీకు కింద చెప్పిన విధంగా పలు లక్షణాలు గనక కనిపిస్తుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. ఇక ఆ లక్షణాలు ఏమిటంటే..
క్యాన్సర్ బారిన పడిన వారు ఆకస్మికంగా బరువు తగ్గిపోతారు. క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో శరీరంలోని గ్లూకోజ్ తోపాటు కొవ్వు నిల్వలను కూడా ఆ వ్యవస్థ కరిగిస్తుంది. దీంతో ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గిపోతారు. మీరు గనక ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గినట్లు మీకు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి. ఇక క్యాన్సర్ గనక ఉంటే రోజూ ఉదయం నిద్రలేవగానే తీవ్రమైన అలసటగా ఉంటుంది. ఒక్కోసారి ఉదయం నుంచి రోజంతా ఈ అలసట కనిపిస్తుంది. చిన్న పని చేసినా తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. ఏ పని చేయబుద్దికాదు. ఈ లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలుగా భావించాలి. వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.
క్యాన్సర్ ఉన్నవారిలో శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు వంటి నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ లక్షణం ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే క్యాన్సర్ ఉన్నవారిలో చర్మం రంగులోనూ మార్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై ఉండే కొన్ని రకాల మచ్చలు పెద్దగా అవడం లేదా నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని కూడా క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కణాలు పెద్దగా మారి చికిత్సకు కూడా స్పందించవు. దీంతో ప్రాణాంతకం అవుతుంది.
తరచూ తీవ్రమైన దగ్గు సమస్య వస్తుందంటే లేదా దగ్గినప్పుడు రక్తం పడుతున్నా కూడా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ లక్షణం కనిపించినా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అలాగే క్యాన్సర్ ఉన్నవారు ఏదైనా మింగాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు నొప్పిగా ఉంటుంది. ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు గొంతులో అడ్డం పడినట్లు అనిపిస్తుంది. అలాగే కొందరికి తినే లేదా తాగే ఆహారం కూడా రుచిగా ఉండదు. తరచూ రుచి కోల్పోయినట్లు అవుతుంది. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉదయం కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాలను కాపాడుకున్న వారు అవుతారు.