Knee Pains | వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరంలో మినరల్స్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా క్యాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి మినరల్స్‌తోపాటు విటమిన్ డి కూడా తగ్గుతుంది. దీంతో సహజంగానే ఎముకలు బలహీనంగా మారుతాయి. దీని ప్రభావం మోకాళ్లలో, కీళ్లలో ముందుగా కనిపిస్తుంది. దీని వల్ల ఆయా భాగాల్లో నొప్పులు వస్తుంటాయి. అయితే వయస్సు మీద పడకపోయినా కొందరికి యుక్త వయస్సులో అయినా సరే పలు ఇతర కారణాల వల్ల మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాగే ఆ ప్రాంతంలో వాపులు కూడా ఉంటాయి. సాధారణంగా మోకాళ్లలో ఉండే పలు రకాల ఎముకలు లేదా నాడులు, కండరాలకు దెబ్బలు తగలడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులు అప్పటికప్పుడు రాకపోయినా తరువాత నెమ్మదిగా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆర్థరైటిస్ సమస్య ప్రారంభంలో ఉన్నా, గౌట్ ప్రారంభంలో ఉన్నా, పలు రకాల మందులను దీర్ఘకాలికంగా ఉపయోగిస్తున్నా, శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువ సేపు చేసినా, గంటల తరబడి కూర్చుని ఉన్నా మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులను తగ్గించేందుకు పలు ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. అలాగే పలు రకాల ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మోకాళ్ల నొప్పులకు శొంఠి, జీలకర్ర, పుదీనా ఆకుల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మిరియాలను 15 గ్రాముల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటినీ కలిపి మెత్తగా నూరి పొడి చేయాలి. దీన్ని పూటకు అర టీస్పూన్ చొప్పున రోజుకు రెండు పూటలా అర కప్పు నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఈ నొప్పులకు వెల్లుల్లి కూడా బాగానే పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని కాస్త దంచి ఒక టీస్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను దంచి పాలలో వేసి మరిగించి ఆ పాలను కూడా తాగవచ్చు. ఇలా చేస్తున్నా కూడా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఆముదం పప్పును తింటుండం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఆముదం పప్పును ఒక గింజతో మొదలు పెట్టి రోజుకు ఒక గింజ చొప్పున పెంచుతూ ఏడు రోజుల పాటు తినాలి. తరువాత ఎనిమిదో రోజు నుంచి ఒక్కో గింజను తగ్గించుకుంటూ తినాలి. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
గసగసాలను నీటిలో నానబెట్టి ఆ నీళ్లను తాగుతున్నా కూడా మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అర టీస్పూన్ శొంఠి పొడి, ఒక టీస్పూన్ నువ్వుల పొడి, అర టీస్పూన్ బెల్లంలను కలిపి ముద్దగా నూరి దాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. అర కప్పు శొంఠి కషాయంలో రెండు టీస్పూన్ల ఆముదం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. అలాగే లేత మునగ ఆకులను నెయ్యిలో వేయించి తింటున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఈత వేర్లకు చెందిన బెరడును కషాయంగా చేసి తాగుతుండాలి. దీని వల్ల కూడా సమస్య తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇవి మనకు ఎక్కువగా చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్‌లో ఉంటాయి. కనుక ఈ ఆహారాలను తరచూ తినాలి. అలాగే వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువగా ఉపయోగించాలి.
మోకాళ్ల నొప్పులు తగ్గేందుకు గాను యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి మోకాళ్లపై భారాన్ని తగ్గించవచ్చు. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, నారింజ, నిమ్మ, పాలకూర, బ్రోకలీ, క్యాప్సికం, చిలగడదుంపలు వంటి ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే పసుపును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పసుపు కలిపిన గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. లేదా పసుపును పాలలో కలిపి తాగాలి. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. అల్లం కూడా యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక రోజూ అల్లం రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తింటుంటే మోకాళ్ల నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.