Hypothyroidism | ప్రస్తుత తరుణంలో థైరాయిడ్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇందుకు కారణాలు కూడా సరిగ్గా తెలియడం లేదు. అయోడిన్ లోపం కారణంగానే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి హైపో థైరాయిడిజం కాగా రెండోది హైపర్ థైరాయిడిజం. రెండు సమస్యల్లోనూ కొన్ని లక్షణాలు మనకు కామన్‌గా కనిపిస్తాయి. కానీ రెండింటికి చెందిన కొన్ని లక్షణాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలా మందికి మాత్రం హైపో థైరాయిడ్ సమస్య వస్తుంటుంది. ఇందులో భాగంగా బరువు అధికంగా పెరిగిపోతారు. శిరోజాలు రాలిపోతుంటాయి. చర్మం పొడిబారిపోతుంది. ఎల్లప్పుడూ బద్దకంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని హైపో థైరాయిడిజం సమస్యగా భావించాలి.
హైపో థైరాయిడిజం ఉన్నవారు డాక్టర్ ఇచ్చిన సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. దీంతోపాటు డైట్ విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పలు రకాల ఆహారాలను హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు తినకూడదు. తింటే థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇక హైపో థైరాయిడిజం ఉన్నవారు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హైపో థైరాయిడిజం ఉంటే సోయా లేదా సోయా ఉత్పత్తులను అసలు తినకూడదు. సోయా లేదా సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. కనుక సోయా లేదా సోయా ఉత్పత్తులను తీసుకోకూడదు. సోయా తోఫు, సోయా పాలు, సోయా ప్రోటీన్ వంటి ఆహారాలను తినకూడదు. అలాగే సోయాతో తయారు చేసే మీల్ మేకర్లను కూడా తినకూడదు. ఇవన్నీ థైరాయిడ్ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
టీ, కాఫీలను కూడా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్న తరువాత కనీసం 30 నుంచి 60 నిమిషాలు ఆగిన తరువాతే టీ లేదా కాఫీ సేవించాలి. లేదంటే థైరాయిడ్ మెడిసిన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోకుండా టీ లేదా కాఫీలోని కెఫీన్ అడ్డుకుంటుంది. దీంతో థైరాయిడ్ సమస్య ఎక్కువవుతుంది. కనుక టీ, కాఫీలను తాగే థైరాయిడ్ పేషెంట్లు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు కొవ్వు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయలేదు. కనుక కొవ్వు పదార్థాలను కూడా వీరు తినకూడదు.
హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను సైతం తీసుకోరాదు. ఇవి కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. చిప్స్, బేకరీ ఆహారాల, బిస్కెట్లు, సూప్‌లు, ఫ్రిజ్‌లో నిల్వ చేయబడిన ఫ్రాజెన్ ఆహారాలు, ప్యాకెట్ ఫుడ్స్ వంటివి ఈ కోవకు చెందుతాయి. కనుక థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు సైతం దూరంగా ఉంటే మంచిది. అలాగే రీఫైన్డ్ ఆహారాలను కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు. ముఖ్యంగా స్వీట్లు ఈ కోవకు చెందుతాయి. స్వీట్లను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుచుకోవచ్చు. అదేవిధంగా తెలుపు రంగులో ఉండే బ్రెడ్, మొక్కజొన్న వంటి ఆహారాలకు సైతం థైరాయిడ్ ఉన్నవారు దూరంగా ఉండాలి. లేదంటే థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా పలు ఆహారాలకు దూరంగా ఉంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుచుకోవచ్చు.