Uric Acid Levels | మన శరీరం ప్యూరిన్ లను విచ్ఛిన్నం చేసినప్పుడు అనేక వ్యర్థాలు విడుదల అవుతాయి. వాటిలో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం లేదా మూత్రపిండాలు తగినంత యూరిక్ యాసిడ్ ను విసర్జించకపోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని హైపర్ యూరిసెమియా అని పిలుస్తారు. ఇది క్రమంగా గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్, కీళ్లల్లో స్ఫటికాలు ఏర్పడడం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. కనుక రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడం చాలా అవసరం. సరైన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే నీరు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలైజింగ్ లక్షణాల కారణంగా యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు శరీరం నుండి కూడా సులభంగా బయటకు పోతుంది. యూరిక్ యాసిడ్ ను సహజంగా తగ్గించే పండ్లు, కూరగాయల వివరాలను వైద్యులు వెల్లడిస్తున్నారు.
కీరదోసకాయలలో 90 శాతం నీరు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. దీంతో మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ సులభంగా బయటకు పోతుంది. దోసకాయలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఆమ్లత్వం కూడా తగ్గుతుంది. చెర్రీస్ లో ఆంథోసైనిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల గౌట్ మంటలు, నొప్పులు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయ కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పలుచబడి మూత్రం ద్వారా సులభంగా బయటకుపోతుంది. వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఆనపకాయలో కూడా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సులభంగా విసర్జించబడుతుంది. ఆనపకాయను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. గౌట్ తో బాధపడే వారు ఆనపకాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టమాటాలను తీసుకోవడం వల్ల శరీరంలో పీహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. టమాటాల్లో ఉండే విటమిన్ సి యూరిక్ యాసిడ్ విసర్జనను ప్రోత్సహిస్తుంది. రోజూ ఉదయం నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుమ్మడికాయలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కొత్తిమీర కూడా మనకు సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యారెట్లలో ఆల్కలైజింగ్ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ లేదా క్యారెట్లను తీసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈవిధంగా ఫైబర్, నీరు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.