Body Pains | మనకు తరచూ పలు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిల్లో బాటీ పెయిన్స్ కూడా ఒకటి. ఒళ్లు నొప్పులు అనేవి సహజంగానే మనకు తరచూ వస్తూనే ఉంటాయి. కాస్త ఎక్కువగా పనిచేసినా లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా మనకు ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అయితే ఇవి రోజూ సరిగ్గా నిద్రిస్తే ఉండవు. ఇందుకు ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ను వాడాల్సిన పనిలేదు. కానీ కొందరికి మాత్రం ఒళ్లు నొప్పులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలా ఒళ్లు నొప్పులు ఎల్లప్పుడూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పనిచేయలేకపోతుంటారు. బయటకు వెళ్లలేకపోతుంటారు. ఇలా ఒళ్లు నొప్పులు ఎప్పుడూ ఉండడం వెనుక పలు బలమైన కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజుకు 6 నుంచి 8 గంటలపాటు నిద్రించాలి. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోయినప్పుడే శరీరం శక్తి వనరులను పునరుత్పత్తి చేసుకుంటుంది. నిద్ర మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీం శక్తి వనరులను భర్తీ చేసుకోకపోవడంతో ఒళ్లు నొప్పులు వస్తాయి. కనుక ఒళ్లు నొప్పులకు దీన్ని ప్రధాన కారణంగా చెప్పవచ్చు. శరరీంలో నీరు తగ్గిపోవడం వల్ల నొప్పులకు దారి తీస్తుంది. శరీరానికి అవసరం అయిన నీటిని తాగకపోవడం, దానికి తోడు శరీరం లోంచి నీరు బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల అలసట, ఒళ్లంతా నొప్పులు వస్తాయి. ఒళ్లు నొప్పులు వచ్చేందుకు దీన్ని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
రక్తంలో ఐరన్ చాలా ముఖ్యమైన మూలకం అని చెప్పవచ్చు. ఇది తక్కువ మొత్తంలో ఉండడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా లభించవు. ఫలితంగా అలసటతోపాటు బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాపుల సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ ఒళ్లు నొప్పులు వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తగ్గించుకుంటే బాడీ పెయిన్స్‌ను తగ్గించుకోవచ్చని అంటున్నారు. చలి, వానా కాలాల్లో జలుబు, ఫ్లూ సమస్యలు సర్వ సాధారణంగా అందరికీ వస్తూనే ఉంటాయి. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా విపరీతంగా ఒళ్లు నొప్పులు ఉంటాయి. కనుక ఒళ్లు నొప్పులకు వీటిని కూడా కారణాలుగా చెబుతున్నారు.
ఒత్తిడి మనల్ని శారీరకంగానే కాక మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే శరరీం బాగా అలసిపోతుంది. దీంతో శరీరం మరింత బలహీనంగా మారుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో మీ శరీరం ఎన్నో రోగాలకు నిలయంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ శరీర నొప్పులుకు కారణం అవుతాయని అంటున్నారు. ఇలా మీకు ఒళ్లు నొప్పులు తరచూ వస్తున్నాయంటే ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చు. వీటిల్లో సరైన కారణాన్ని తెలుసుకుని అందుకు తగిన విధంగా సమస్యను పరిష్కరించుకోవాలి. దీంతో ఒళ్లు నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.