Blood In Urine | మన శరీరంలో మెటబాలిజం ప్రక్రియ వల్ల ఎప్పటికప్పుడు వ్యర్థాలు చేరుతుంటాయి. ఈ వ్యర్థాలు పలు మార్గాల ద్వారా బయటకు వెళ్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రక్తం శుద్ధి చేయబడి వ్యర్థాలు తొలగిపోతాయి. అనంతరం ఆ వ్యర్థాలు మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. కనుకనే నీళ్లను ఎక్కువగా తాగాలని, దీంతో శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించుకోవచ్చని డా. శ్రీధర్ చెబుతున్నారు. అయితే మన మూత్రాన్ని పరిశీలించి కూడా వైద్యులు వైద్యం చేస్తుంటారు. మూత్ర పరిశీలన ద్వారా వారికి అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మూత్రం ఉన్న రంగు చాలా కీలకం. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. అలా కాకుండా మూత్రం బ్రౌన్ కలర్ లో వస్తుంటే నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి.
ఇక కొందరికి అప్పుడప్పుడు మూత్రం ఎరుపు రంగులోనూ వస్తుంటుంది. బీట్రూట్ వంటి ఆహారాలను తిన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. కానీ ఎరుపు రంగుకు కారణం అయ్యే ఎలాంటి ఆహారాలను తీసుకోకపోయినప్పటికీ మూత్రం ఎరుపు రంగులో వస్తుందంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. మూత్రంలో రక్తం పడుతుంటే ఇలా జరుగుతుంది. అయితే మూత్రంలో రక్తం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ రావడం ఇందుకు ప్రధాన కారణమని వారు అంటున్నారు. అలాగే కిడ్నీ స్టోన్లు రావడం, కిడ్నీ వ్యాధులు ఉండడం, వాపులు ఏర్పడడం, దెబ్బలు తగలడం, క్యాన్సర్ వంటి కారణాల వల్ల కూడా మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. అయితే ఇలా మూత్రం ఎరుపు రంగులో రావడాన్ని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు.
ఎవరికైనా మూత్రం ఎరుపు రంగులో వస్తుంది అంటే వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో ఈ సమస్యకు అసలు కారణాన్ని గుర్తించవచ్చు. మూత్రం ఎరుపు రంగులో రావడం లేదా మూత్రంలో రక్తం రావడం కొందరికి సహజంగానే జరుగుతుంది. అయితే కొందరికి మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే యూరాలజిస్ట్లను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్సను అందిస్తారు.
ఈ సమస్యకు వైద్యులు ఇచ్చే మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్లను కలిగించే ఆహారాలను తినకూడదు. కిడ్నీ స్టోన్ల వల్లే మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు మందులను ఇస్తారు. అలాంటప్పుడు స్టోన్స్‌ను కలిగించే ఆహారాలను తినకూడదు. అలాగే నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. దీంతో వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతాయి. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నవారు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు ఇచ్చిన మందులను వాడితే కచ్చితంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
Dr. Kammela Sridhar
Director MS,MCh(URO),F.R.U(USA)
Senior Kidney Transplant Surgeon,
Urologist and Andrologist