Acne | మొటిమలు అనేవి సాధారణంగా అందరికీ వస్తుంటాయి. యుక్త వయస్సులో ఉన్నవారికి ఇవి ఎక్కువగా వస్తాయి. మొటిమలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఆ కారణాలు ఏమున్నప్పటికీ ముఖంపై మొటిమలు ఉంటే మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలో ముఖం చూపించాలంటే ఇబ్బంది పడుతుంటారు. కేవలం స్త్రీలనే కాదు, పురుషులను కూడా మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే పలు ఇంటి చిట్కాలను పాటిస్తూ, పలు ఆహారాలను తీసుకుంటుంటే మొటిమలను తగ్గించుకోవచ్చు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం అందంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం సురక్షితంగా ఉంటుంది. అలాగే మొటిమలు ఉన్నవారు పలు జాగ్రత్తలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను తగ్గించేందుకు టీ ట్రీ ఆయిల్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని ఉపయోగిస్తే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకు గాను కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట ముఖంపై అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇక మొటిమలు తగ్గేందుకు కలబంద గుజ్జు కూడా పనిచేస్తుంది. దీన్ని కూడా కాస్త తీసుకుని రాత్రి పూట మొటిమలు ఉన్న చోట రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీని వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. కనుక గ్రీన్ టీ బ్యాగులను కూడా వాడవచ్చు. గ్రీన్ టీ బ్యాగ్‌ను తీసుకుని చల్లార్చి మొటిమలు ఉన్న చోట 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
తేనె, దాల్చిన చెక్కలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. కొద్దిగా తేనె, దాల్చిన చెక్క పొడి తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని మొటిమలపై రాయాలి. 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా మొటిమలను తగ్గించుకోవచ్చు. మొటిమలు తగ్గేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చర్మం పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తుంది. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని దానికి 3 రెట్లు ఎక్కువ మొత్తంలో నీళ్లను కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాసి 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా మొటిమలు తగ్గిపోతాయి.
మొటిమల సమస్య ఉన్నవారు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జింక్ అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. జీడిపప్పు, బాదంపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, శనగలు, పప్పు దినుసులను తినాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్‌ను తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు, పాలకూర, గ్రీన్ టీలతోపాటు ప్రొ బయోటిక్ ఆహారాలు అయిన పెరుగు, పాలు, మజ్జిగ వంటివి తీసుకుంటుండాలి. ఇక మొటిమలు ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. చక్కెర అధికంగా ఉండే పానీయాలు, స్వీట్లు, ఆవు పాలు, వేపుళ్లు, చిప్స్, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్, బేకరీ ఆహారాలు వంటివి తీసుకోకూడదు. అలాగే పొగ తాగడం మానేయాలి. మద్యం సేవించకూడదు. రాత్రి పూట త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్ర లేవాలి. ఇలా పలు చిట్కాలను పాటిస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మొటిమలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యం కూడా మెరుగు పడుతుంది.