Sudden Weight Gain | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసే వారికే ఆ బాధ ఏమిటనేది తెలుస్తుంది. కొందరు ఆహారం తిన్నా తినకపోయినా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. కొందరు ఎంత తిన్న కూడా సన్నగానే ఉంటారు. దీనికి శరీర తత్వం, జన్యువులే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా అధికంగా బరువు పెరుగుతున్నారంటే అందుకు అధికంగా ఆహారం తీసుకోవడం ఒక్కటే కాదు, ఇంకా అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు దోహదం చేస్తాయని అంటున్నారు. అయితే ఎందుకు బరువు పెరుగుతున్నారో కనిపెట్టగలిగితే సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్య ఉంటే సహజంగానే బరువు పెరుగుతారు. థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒకటి హైపర్ థైరాయిడ్ కాగా రెండోది హైపో థైరాయిడ్. హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారం తినకపోయినా బరువు పెరుగుతుంటారు. ఎందుకంటే వీరిలో మెటబాలిజం సరిగ్గా ఉండదు. శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు. దీంతో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. కనుక ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరుగుతున్నారు అంటే అందుకు థైరాయిడ్ కారణంగా భావించాలి. థైరాయిడ్ ఉందా, లేదా అని పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ థైరాయిడ్ గనక ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
మహిళలు ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరుగుతుంటే అందుకు పీసీఓఎస్ అనే వ్యాధి కారణం అవుతుందేమోనని అనుమానించాలి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌గా పిలవబడే ఈ వ్యాధి వస్తే స్త్రీలలో అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరుగుతారు. మహిళలు సడెన్‌గా బరువు పెరిగిపోతుంటే ఈ వ్యాధి ఉందో లేదో పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ వ్యాధి ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో బరువు కూడా తగ్గుతారు. అలాగే ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు కూడా అధికంగా బరువు పెరుగుతారని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. మీకు కూడా ఒత్తిడి, ఆందోళన ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఉంటే వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేయండి. దీంతో బరువును తగ్గించుకోవడం సులభతరం అవుతుంది.
మెనోపాజ్ దశలో ఉండే స్త్రీలు కూడా అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దశలో ఉన్న స్త్రీలలో హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. అలాగే ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉండే వారిలో కూడా హార్మోన్ల సమతుల్యత సరిగ్గా ఉండదు. దీని వల్ల ఆహారాన్ని అధికంగా తింటుంటారు. ఇది బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. అదేవిధంగా కొందరు స్త్రీలకు అండాశయం లేదా గర్భాశయంలో గడ్డలు ఉంటాయి. అలాంటప్పుడు అవి హార్మోన్ల సమస్యలను కలగజేస్తాయి. దీంతో స్త్రీలు అధికంగా బరువు పెరుగుతారు. కొన్ని రకాల మందులను వాడే వారు కూడా అధికంగా బరువు పెరుగుతారు. మెటబాలిజం, హార్మోన్లకు సంబంధించి మెడిసిన్లను ఉపయోగించే వారు బరువు పెరుగుతారు. స్టెరాయిడ్స్ వాడినా కూడా బరువు పెరుగుతారు. సరిగ్గా నిద్ర పోక పోయినా బరువు పెరుగుతారని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక మీరు ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరిగితే అందుకు కారణం తెలుసుకోండి. దీంతో పెరిగిన బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.