Intestines Health | ఇప్పటి జీవనశైలిలో గట్ హెల్త్ లేదా జీర్ణాశయ ఆరోగ్యం గురించి అవగాహన వేగంగా పెరుగుతోంది. ఎందుకంటే పేగుల ఆరోగ్యం కేవలం జీర్ణక్రియకే పరిమితం కాదు. శరీర రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, శక్తి స్థాయిలు, చర్మ ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఇది ప్రభావం చూపుతుంది. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి గట్ ఫ్రెండ్లీ సలహా నిజంగా ఉపయోగకరమై ఉండకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, చాలా మంది ప్రతిరోజూ పాటించే కొన్ని సాధారణ అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయని చెబుతున్నారు. చాలా మందికి ఇవి తెలియకుండానే అలవాట్లుగా మారిపోయాయని పేర్కొంటున్నారు. పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే రోజువారీ అలవాట్ల గురించి వారు వివరిస్తున్నారు.
చాలామంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఇలా అకస్మాత్తుగా ఫైబర్ పరిమాణం పెంచితే పొట్ట ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్రమంగా ఫైబర్ పరిమాణాన్ని పెంచడం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే బరువు పెరుగుతామనే భయంతో కొందరు అన్ని రకాల ఫ్యాట్స్‌ను ఆహారంలో నుంచి పూర్తిగా తొలగిస్తారు. అయితే ఆరోగ్యకరమైన కొవ్వులు పేగుల పొరను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గింజలు, అవకాడో, నెయ్యి వంటి మంచి కొవ్వులను పరిమితంగా తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
అదే విధంగా రోజూ ఒకేరకం ఆహారాన్ని పదే పదే తినడం కూడా గట్ హెల్త్‌కు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వైవిధ్యమైన ఆహారంతోనే సమతుల్యంగా పెరుగుతాయి. అందుకే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు వంటి విభిన్న ఆహారాలను తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. అంతేకాకుండా భోజనాన్ని కార్బొహైడ్రేట్స్‌తో ప్రారంభించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందు ఫైబర్ లేదా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుని, తర్వాత కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం జీర్ణక్రియకు మంచిదని సూచిస్తున్నారు.
ఇక సౌకర్యవంతంగా ఉంటాయని భావించి చాలామంది ప్రోటీన్ బార్లు, షేక్స్‌ను తరచూ తీసుకుంటున్నారు. కానీ వీటిలో చాలా వరకు అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి గట్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, ప్రతిరోజూ భోజనం చేసే సమయాలు మారుతూ ఉంటే జీర్ణవ్యవస్థ గందరగోళానికి గురవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పేగులు ఒక నిర్దిష్ట సమయానికి అలవాటు పడతాయి కాబట్టి, సమయపాలన చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. అదే విధంగా తిన్న వెంటనే పడుకోవడం కూడా జీర్ణక్రియను మందగింపజేస్తుంది. భోజనం తర్వాత కొంతసేపు నిటారుగా కూర్చోవడం లేదా నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహాయపడుతుంది.
ఈ విధంగా ఈ సూచనలు గట్ హెల్త్ కోసం కఠినమైన డైట్స్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ చిన్నచిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.