Dolo 650 Tablets | డోలో 650.. ఈ పేరు మన దేశంలో చాలా మందికి పరిచయం ఉన్నది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో డోలో ట్యాబ్లెట్లను ప్రజలు భారీ ఎత్తున కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకునేవారు. చిన్నపాటి జ్వరం వచ్చినా కోవిడ్ వచ్చిందేమోనని అనుమానించి వెంటనే డోలో ట్యాబ్లెట్లను వాడేవారు. అలా డోలో ట్యాబ్లెట్ చాలా పాపులర్ అయింది. నోరు తిరగని వారు లేదా చదువు రాని వారు కూడా ఈ ట్యాబ్లెట్లను చాలా సులభంగా పలకగలుగుతారు. ఈ ట్యాబ్లెట్ పాపులర్ అవ్వడం వెనుక ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే డోలో ట్యాబ్లెట్లను ప్రస్తుతం చాలా మంది డాక్టర్ సూచన లేకుండా అధిక మొత్తంలో వాడుతున్నారని ఇటీవలే చేపట్టిన కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డోలో ట్యాబ్లెట్లను అధికంగా వాడుతున్న వారు లేదా డాక్టర్ సూచన లేకుండా వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డోలో ట్యాబ్లెట్లలో 650 మిల్లీగ్రాముల మోతాదులో పారాసిటమాల్ ఉంటుంది. పారాసిటమాల్ అధిక మొత్తంలో ఉండే ట్యాబ్లెట్లలో డోలో కూడా ఒకటి. విదేశాల్లో పారాసిటమాల్‌ను అసిటామైనోఫెన్గా వ్యవహరిస్తారు. డోలో ట్యాబ్లెట్లు అనాల్జెసిక్‌గా పనిచేస్తాయి. అంటే శరీరంలోని ఆయా భాగాల్లో వచ్చే నొప్పులను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. అలాగే ఈ ట్యాబ్లెట్లు యాంటీ పైరెటిక్గా కూడా పనిచేస్తాయి. అంటే జ్వరాన్ని తగ్గిస్తాయన్నమాట. మన దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా చిన్నపాటి మెడికల్ షాపుల్లోనూ డోలో ట్యాబ్లెట్లు లభిస్తాయి. అందుకనే ప్రజల్లో ఇవి బాగా పాపులర్ అయ్యాయి. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు, వాక్సిన్ తీసుకున్నప్పుడు లేదా పలు ఇతర కారణాల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు డోలో ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. డోలో ట్యాబ్లెట్లను వాడితే తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, దంతాల నొప్పి, చెవి నొప్పి, మహిళలకు వచ్చే రుతుక్రమ నొప్పి వంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డోలో ట్యాబ్లెట్లను 12 ఏళ్లకు పైబడిన వారికి డాక్టర్లు సూచిస్తారు. డోలో ఒక ట్యాబ్లెట్ డోసు 650 మిల్లీగ్రాములు. రోజుకు 4 ట్యాబ్లెట్లను గరిష్టంగా తీసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తారు. ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది. 24 గంటల వ్యవధిలో డోలో ట్యాబ్లెట్ డోసు 1950 ఎంజీ మాత్రమే. అంటే రోజుకు 3 ట్యాబ్లెట్లను మాత్రమే వేసుకోవాలి. అవసరాన్ని బట్టి 6 గంటలకు లేదా 4 గంటలకు ఒకటి వాడాలని కేవలం డాక్టర్లు మాత్రమే చెబుతారు. కానీ కొందరు ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా డోలో ట్యాబ్లెట్లను వాడుతున్నారు. ఇలా వాడడం శరీరంపై దుష్పరిణామాలను కలగజేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. డోలో ట్యాబ్లెట్లను తీసుకున్న తరువాత 30 నిమిషాల నుంచి నొప్పులు, జ్వరం తగ్గడం మొదలవుతాయి. ఒక్క ట్యాబ్లెట్ పవర్ శరీరంలో 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.
డోలో 650 ట్యాబ్లెట్లను అధికంగా వాడితే అలర్జీలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తాయి. లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీల పనితీరు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. రక్త సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. లివర్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సూచన లేకుండా డోలో ట్యాబ్లెట్లను వాడరాదు. లేదంటే సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. డోలో ట్యాబ్లెట్లను వేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించకూడదు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతున్నవారు డోలో ట్యాబ్లెట్లను వాడాల్సి వస్తే డాక్టర్‌కు ఈ విషయం చెప్పాలి. లేదంటే రెండు మెడిసిన్లకు సరిపోక అలర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సూచన మేరకు మాత్రమే డోలో 650 ట్యాబ్లెట్లను వాడుకోవాలి. ఈ ట్యాబ్లెట్లను కేవలం కొద్ది రోజుల కోసం మాత్రమే డాక్టర్లు సూచిస్తారు. ఎక్కువ కాలం ఈ ట్యాబ్లెట్లను వాడకూడదు. డోస్ అధికం అయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.