Eggs | మన శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. గుడ్డులో ప్రోటీన్ తో పాటు విటమిన్ బి12, డి, ఎ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కండరాల మరమ్మత్తుకు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు. వీటిని తీసుకునే విషయంలో నియంత్రణ, సమతుల్యత చాలా కీలకమని వారు తెలియజేస్తున్నారు. గుడ్లను ఆహారంగా తీసుకునే విషయంలో వాటిని ఏ ఆహారంతో కలిపి తీసుకుంటున్నారు, వాటిని ఎంత మోతాదులో తింటున్నారు, శుభ్రత, మన శరీర ఆరోగ్యం వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లను తినేటప్పుడు మనం చేయవలసిన, చేయకూడని కొన్ని పనుల గురించి వారు వివరిస్తున్నారు.
గుడ్డును తీసుకునేటప్పుడు కొందరు పచ్చసొనను వదిలేసి తెల్లసొనను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ గుడ్డును మొత్తంగా తీసుకున్నప్పుడే మన శరీరానికి పోషకాలు ఎక్కువగా అందుతాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి, కోలిన్ వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి. గుడ్డును పచ్చసొనతో సహా మితంగా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది. గుడ్డును ఉడికించడం వల్ల దానిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన కొవ్వులు ఉండవు. నూనెలో వేయించడం వల్ల అదనంగా క్యాలరీలు జోడించబడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అంత మంచివి కావు. కనుక గుడ్డును ఉడికించి తీసుకోవడమే మంచిది.
అదేవిధంగా గుడ్లను అధిక ఫైబర్ కలిగిన ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో మనకు అనారోగ్యకరమైన చిరుతిండిని తినాలనే కోరిక తగ్గుతుంది. ఇక గుడ్లను నిల్వ చేసే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వాటిని ఎల్లప్పుడూ ఫ్రిజ్ లో ఉంచడం మంచిది. గుడ్లను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల వాటిపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గడువు తేదీలను గమనించిన తరువాతే గుడ్లను కొనుగోలు చేయాలి. గుడ్లను ఉడికించే ముందు వాటిని కడగడం మంచిది. కొన్నిసార్లు గుడ్లను ఉడికించేటప్పుడు అవి పగులుతూ ఉంటాయి. గుడ్లను ముందుగానే కడగడం వల్ల గుడ్డు పగిలినప్పటికి సాల్మొనెల్లా బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి.
అలాగే గుడ్లను చాలా మంది పచ్చిగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కనుక గుడ్డును పూర్తిగా ఉడికించి తీసుకోవడం మంచిది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు గుడ్డును 3 నుండి 4 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి వారు గుడ్డు తెల్లసొనను తీసుకోవడం మంచిది. అధిక కొవ్వు కలిగిన ఆహారాలతో గుడ్డును కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్లల్లో ప్రోటీన్ ఉన్నప్పటికీ ప్రోటీన్ కోసం ఎల్లప్పుడూ గుడ్లపైనే ఆధారపడకూడదు. ప్రోటీన్ కలిగిన ఇతర ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి. గుడ్డును ఉప్పు, నూనె వంటి వాటితో కలిపి ఆమ్లెట్ చేసి తీసుకోవడం మంచిది కాదు.
రుచి కోసం మూలికలు, సుగంద ద్రవ్యాలు కలిపి తీసుకోవడం మంచిది. అలాగే గుడ్డును తీసుకునేటప్పుడు తాజాదనాన్ని గమనించడం కూడా చాలా ముఖ్యం. చెడిపోయిన గుడ్లు తీవ్రమైన అనారోగ్యాన్ని, జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. గుడ్లను ఆహారంగా తీసుకునే విషయంలో ఇలా అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డును తీసుకుంటే సరిపోతుందని వారి జీవనశైలి, ఆరోగ్యాన్ని బట్టి రోజుకు రెండు కూడా తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.