Dinner | ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అసమయ భోజనం, రాత్రివేళల్లో ఉండే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా తినడం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలిక ఒత్తిడితోపాటు లేట్‌నైట్ స్నాకింగ్ అలవాటు ఉంటే పేగుల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో నిర్వహించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో 11 వేల మందికి పైగా పాల్గొన్న వారి వివరాలను పరిశీలించారు. శరీరంలో ఒత్తిడి స్థాయిని సూచించే బాడీ మాస్ ఇండెక్స్, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అంశాల ఆధారంగా అధ్యయనం చేశారు. రోజువారీ తీసుకునే క్యాలరీల్లో 25 శాతం కంటే ఎక్కువ భాగాన్ని రాత్రి 9 గంటల తర్వాత తీసుకునే వారిలో మలబద్ధకం, డయేరియా వంటి పేగు సమస్యలు ఎక్కువగా కనిపించాయని గుర్తించారు.
అధిక ఒత్తిడితోపాటు రాత్రివేళల్లో ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారిలో పేగు సమస్యలు వచ్చే అవకాశం 1.7 రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఆహారం ఏమి తింటున్నామన్నది మాత్రమే కాకుండా ఎప్పుడు తింటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ గట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న మరో 4 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను కూడా పరిశీలించారు. అధిక ఒత్తిడి, లేట్‌నైట్ ఈటింగ్ అలవాట్లు ఉన్నవారిలో పేగు సమస్యలు 2.5 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయని తేలింది. వీరిలో గట్ మైక్రోబియోమ్ వైవిధ్యం కూడా గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అలాగే మెదడు, పేగుల మధ్య ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థను గట్-బ్రెయిన్ యాక్సిస్ అంటారు. నరాలు, హార్మోన్లు, పేగు బ్యాక్టీరియా కలిసి పనిచేసే ఈ వ్యవస్థపై ఒత్తిడి, భోజన సమయాలు ప్రభావం చూపవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో అసమయ భోజనం చేయడం వల్ల ఒత్తిడి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
అయితే ఈ అధ్యయనం ఫలితాన్ని స్పష్టంగా నిర్ధారించలేదని పరిశోధకులు తెలిపారు. ఒత్తిడి, భోజన అలవాట్లు, పేగు ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అదనపు పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమబద్ధమైన భోజన సమయాలను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా తినే అలవాటును తగ్గించి, సమయానికి భోజనం చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.