Sleeplessness | ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రోజూ తగినంత నిద్రించడం మన శరీరానికి చాలా అవసరం. శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు శరీర మరమ్మత్తు కూడా మనం నిద్రించినప్పుడే జరుగుతుంది. కానీ మనం నిద్రించే సమయం రోజురోజుకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దాదాపు నలుగురిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు నిపుణులు చెబుతున్నారు. రోజూ తగినంత నిద్రించకపోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో జీవక్రియలు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం రోజూ తగినంత నిద్రించడం చాలా అవసరం.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం మన నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. నిద్రించే ముందు డిజిటల్ పరికరాలను ఎక్కువగా చూడడం వల్ల నిద్ర రావడం తగ్గుతుంది. కనుక నిద్రపోవడానికి కనీసం అరగంట నుండి గంట ముందు డిజిటల్ పరికరాలను చూడడం ఆపేయాలి. దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అదే విధంగా రోజూ ఒకే సమయానికి నిద్రించే అలవాటు చేసుకోవాలి. వారాంతంలో కూడా అదే సమయానికి నిద్రించేలా అలవాటు చేసుకోవాలి. నిద్రించే సమయం రోజూ మారే కొద్ది శరీరంలో ఉండే అంతర్గత గడియారం నిద్రను తిరిగి సమకాలీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక రోజూ ఒకే సమయానికి నిద్రించడం మంచిది. అలాగే నిద్రించే గది వాతావరణం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
మెదడుకు సంకేతాలు ఇవ్వడంలో భౌతిక వాతావరణం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గది ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుండి 22 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీంతో గాఢ నిద్ర మన సొంతమవుతుంది. అలాగే గదిలో కాంతి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. నిశ్శబ్ద వాతావరణం ఉండడం వల్ల నిద్రకు భంగం లేకుండా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు వారి సాయంత్రం సమయాన్ని తక్కువ సృజనాత్మక కలిగిన కార్యకలాపాలల్లో గడపాలి. దీంతో ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. లోతైన నిద్రకు మనసు తేలికగా ఉండడం కూడా చాలా అవసరం. అలాగే మరుసటి రోజు చేయాల్సిన పనులను ముందుగానే అనుకుని నిద్రించాలి. ఇలా చేయడం వల్ల ఆలోచనలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.
నిద్రించడానికి ముందు మూలికా కషాయాలను తీసుకోవడం మంచిది. ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక పగటి పూట మనం తీసుకునే ఆహారం కూడా రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది. కెఫిన్ కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రి నిద్ర తగ్గుతుంది. కనుక కెఫిన్ ఉండే పానీయాలను తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు అధికంగా తీసుకోవాలి. శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలు లేకుండా చూసుకోవాలి. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. మనం నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోగలం. దీంతో మన శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.