Lemon Water | అధిక బరువు తగ్గడం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువు పెరగడం సులభమే. కానీ తగ్గించుకోవడమే కష్టం. 1 కిలో బరువు పెరిగేందుకు 3 రోజులు చాలు. కానీ తగ్గేందుకు 10 రోజులు శ్రమించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. జిమ్లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ విషయంలోనూ జాగ్రత్తలను తీసుకుంటారు. ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు పలు ప్రత్యేక పానీయాలను కూడా సేవిస్తుంటారు. అలాంటి పానీయాల్లో నిమ్మకాయ నీళ్లు కూడా ఒకటి. చాలా మంది ఉదయం పరగగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగుతుంటారు. దీని వల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ నిమ్మకాయ నీళ్లను తాగాలని అనుకుంటున్న వారు పలు సూచనలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయ నీళ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. నిమ్మకాయ నీళ్లను రోజూ తాగడం చాలా సులభం. సింపుల్ గా నీళ్లను కాస్త వేడి చేసి అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగేయడమే. ఈ నీళ్ల వల్ల కేవలం 6 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందుకనే బరువును తగ్గించడం కోసం ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. అయితే కొందరు ఈ నీటిలో తేనెకు బదులుగా చక్కెర కలిపి తాగుతుంటారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మకాయ నీళ్లలో చక్కెర కలపకూడదు. అలా కలిపి తాగితే ఈ నీళ్లను తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు. బరువు తగ్గాలనుకునే మీ కోరిక నెరవేరదు. ఇక కొందరు ఈ నీళ్లలో ఉప్పు కలిపి తాగుతారు. ఉప్పును కూడా కలపకూడదు. ఎండవల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడితేనే అలాంటి సందర్భంలోనే నిమ్మకాయ నీళ్లలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. అంతేకానీ బరువు తగ్గడం కోసం ఉపయోగించే నిమ్మకాయ నీళ్లలో ఉప్పు, చక్కెర కలపకూడదు.
ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పి కొందరు అదే పనిగా ఈ నీళ్లను తాగుతుంటారు. అలా ఎట్టి పరిస్థితిలోనూ ఈ నీళ్లను సేవించకూడదు. రోజుకు 1 లేదా 2 సార్లు తాగాలని మాత్రమే నియమం పెట్టుకోవాలి. అన్నే సార్లు తాగాలి. లేదంటే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. నిమ్మకాయ నీళ్లను తయారు చేసేందుకు ఉపయోగించే నీళ్లు చాలా శుభ్రంగా ఉండాలి. అవి ఫిల్టర్ అయిన నీళ్లు అయి ఉండాలి. బయటి నుంచి కొందరు 20 లీటర్ల క్యాన్లను తెచ్చుకుని ఆ నీళ్లను ఉపయోగిస్తారు. ఆ నీళ్లు మంచివే. కానీ ఆ నీళ్లను అయినా సరే ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నీళ్లతో నిమ్మరసం రసాయన చర్య జరుపుతుంది. అప్పుడు నీళ్లు మారిపోతాయి. అలాంటి నీళ్లను తాగినా ప్రయోజనం ఉండదు.
నిమ్మకాయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి కొందరు నేరుగా నిమ్మరసాన్ని సేవిస్తుంటారు. ఇలా చేయడం హానికరం. ఎందుకంటే నిమ్మకాయ రసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి దంతాలకు నేరుగా తాకితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దీంతో దంతాలు బలహీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోతాయి. దంత క్షయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ నీళ్లలో కలిపి మాత్రమే తాగాలి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు ఈ నీళ్లను ఎట్టి పరిస్థితిలోనూ పరగడుపున సేవించకూడదు. ఈ నీళ్లను తాగాలనుకుంటే ఉదయం అల్పాహారం చేసిన తరువాత 40 నిమిషాలు ఆగి ఆ తరువాత తాగవచ్చు. ఆహారం తింటానికి ముందు లేదా తిన్న వెంటనే కూడా ఈ నీళ్లను సేవించకూడదు. లేదంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఇలా నిమ్మకాయ నీళ్లను తాగే విషయంలో పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఈ నీళ్లతో ప్రయోజనాలను పొందవచ్చు.