Sleep | ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు చాలానే ఉంటున్నాయి. దీంతో ఆయా సమస్యలతో సగటు పౌరుడు ఇబ్బంది పడుతున్నాడు. చాలా మంది ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. కొందరు డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అందరినీ ఒత్తిడి ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఉదయం హడావిడిగా నిద్రలేచి మళ్లీ ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. దీంతో జీవన విధానం, ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీర్ఘకాలంలో ఇది నిద్రలేమి సమస్యకు దారి తీస్తోంది. అయితే రాత్రి పూట కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలను రాత్రి పూట తీసుకుంటే దాంతో నిద్ర త్వరగా పట్టేలా చేస్తాయి. ట్రిప్టోఫాన్ అనేది ఓ అమైనో యాసిడ్. ఇది శరీరంలో సెరొటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. ట్రిప్టోఫాన్ మనకు పాల ద్వారా అధికంగా లభిస్తుంది. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే అందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర పట్టేలా చేస్తుంది. దీంతోపాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. బాదంపప్పు, వాల్ నట్స్‌లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది. అలాగే మెగ్నిషియం కూడా వీటి ద్వారా అధికంగానే లభిస్తుంది. ఇవి మెలటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఈ పప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సైతం సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ట్రిప్టోఫాన్, మెగ్నిషియం, జింక్ ఉంటాయి. ఇవన్నీ నిద్ర పట్టేలా చేస్తాయి. రోజూ వీటిని నీటిలో నానబెట్టి తింటుంటే ఉపయోగం ఉంటుంది. కోడిగుడ్లను కూడా రోజూ తినాలి. రోజుకు ఒక గుడ్డును తింటే ట్రిప్టోఫాన్తోపాటు పలు రకాల బి విటమిన్లు లభిస్తాయి. ఇవి సెరొటోనిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పడుతుంది. మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. మెగ్నిషియం వల్ల కండరాలు ప్రశాంతంగా మారుతాయి. న్యూరోట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. మెగ్నిషియం మనకు ఆకుపచ్చని కూరగాయలతోపాటు ఆకుకూరలు, అరటి పండ్లు, అవకాడో, ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజల్లో లభిస్తుంది.
మెలటోనిన్‌ను ఉత్పత్తి చేసే ఆహారాలను తింటున్నా కూడా నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. చెర్రీ టమాటాలను తినడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర పట్టేలా చేస్తుంది. కివి పండ్లను తింటున్నా కూడా మేలు జరుగుతుంది. ఈ పండ్లు సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచి నిద్ర పట్టేలా చేస్తాయి. పిస్తాలను తింటున్నా కూడా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఓట్స్ కూడా ఇందుకు ఎంతగానో సహకరిస్తాయి. రాత్రి పూట కమోమిల్ అనే హెర్బల్ టీని సేవిస్తుంటే నిద్ర చక్కగా పడుతుంది. తులసి ఆకుల టీని తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా పలు రకాల ఆహారాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభించడమే కాదు, నిద్ర కూడా చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.