Pigmentation | మనం ఎదుర్కొనే చర్మ సంబంధిత సమస్యల్లో పిగ్మెంటేషన్ ఒకటి. చాలా మంది దీనిని చర్మ ఉపరితలంపై వచ్చే సమస్యగా భావిస్తారు. దీనిని తగ్గించుకోవడానికి క్రీములు, సీరమ్స్ వంటి వాటిని వాడడంతో పాటు అనేక రకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది నిరాశకే గురి అవుతూ ఉంటారు. మచ్చలు తగ్గినప్పటికీ కొంతకాలం తరువాత ఇవి మరలా తిరిగి వస్తూ ఉంటాయి. అయితే పిగ్మెంటేషన్ చర్మం గురించి మాత్రమే కాదు మన శరీరం గురించి కూడా తెలియజేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణక్రియ, హార్మోన్లు, ఒత్తిడి, నిద్రతో పిగ్మెంటేషన్ కు దగ్గర సంబంధం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. మొండిగా ఉండే పిగ్మెంటేషన్, పునరావృతం అయ్యే పిగ్మెంటేషన్ అంతర్గత ఆరోగ్యాన్ని సూచిస్తుందని శరీరం మంటగా లేదా ఒత్తిడికి గురైతే కూడా చర్మం దానిని పిగ్మెంటేషన్ రూపంలో చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పిగ్మెంటేషన్ తో బాధపడే వ్యక్తుల్లో పొట్ట ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాటు పోషకాల శోషణ కూడా సరిగ్గా ఉండదని, వారు అధిక ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడుతూ ఉంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పిగ్మెంటేషన్ తో బాధపడే వారు ఇంటి చిట్కాలను పాటించడంతో పాటు ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు చర్మం తనను తాను రిపేర్ చేసుకోవడానికి తగిన పోషకాలను పొందదు. దీంతో చర్మంపై మచ్చలు అలాగే ఉంటాయి. కనుక రోజూ ఇంట్లో వండిన ఆహారాలనే తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. పొట్ట 80 శాతం నిండగానే తినడం మానేయాలి. కాలేయం వ్యర్థాలను తొలగించడం మందగించినప్పుడు పిగ్మెంటేషన్ మొండిగా మారుతుంది. హార్మోన్లు సరిగ్గా లేనప్పుడు, కణాల వాపు ఎక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ కణాలు అతిగా ప్రేరేపించబడతాయి. దీని వల్ల పిగ్మెంటేషన్ తిరిగి మరలా వస్తుంది. కనుక ఆహారంలో పండ్లను, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
వంటలో పసుపు, నల్లమిరియాలు ఎక్కువగా వాడాలి. నీటిని ఎక్కువగా తాగాలి. రాత్రిపూట అతిగా తినడం, మద్యం తాగడం వంటివి మానేయాలి. ఇన్సులిన్ నిరోధకత, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండడం, కార్టిసాల్ అసమతుల్యతలు పిగ్మెంటేషన్ ను ప్రభావితం చేస్తాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని నిశ్శబ్దంగా పెంచుతాయి. కనుక భోజనాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. శుద్ది చేసిన చక్కెరను తీసుకోవడం తగ్గించాలి. ఒత్తిడి తగ్గడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి. రోజూ నడవడం లేదా శారీరక వ్యాయామాలు చేయడం చేయాలి. నిద్ర, సిర్కాడియన్ రిథమ్ తో మెలనిన్ ఉత్పత్తి ముడిపడి ఉందని సైన్స్ చెబుతుంది.
నిద్రలేమి ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచుతుంది, కార్టిసాల్ ను పెంచుతుంది. కనుక రోజూ 6 నుండి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. స్థిరమైన నిద్ర సమయాలను పాటించాలి. రాత్రిపూట స్క్రీన్ వాడకాన్ని తగ్గించాలి. మనం నిద్రించినప్పుడే చర్మం మరమ్మత్తు జరుగుతుంది. పిగ్మెంటేషన్ తగ్గాలంటే శరీరం ఆరోగ్యం మొత్తం మెరుగుపడాలి. జీర్ణక్రియ, హార్మోన్లు, ఒత్తిడి, నిద్ర అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.