Hiccups | ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. వెక్కిళ్లు రావడం సర్వసాధారణం. నిమిషానికి 4 నుండి 6 సార్లు వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. కొంతసమయానికి వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. వీటి వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. ఆందోళన, ఒత్తిడి, మద్యం సేవించడం, ధూమపానం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, అతిగా భోజనం చేయడం వంటి కారణాల వల్ల వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. అయితే కొందరిలో వెక్కిళ్లు 2 రోజులకు పైగా వస్తూ ఉంటాయి. ఇలా రావడం అంత మంచిది కాదు. రెండు రోజులకు పైగా వెక్కిళ్లు రావడం శరీరంలో అంతర్లీన సమస్యలను సూచిస్తాయి.
ఊపిరితిత్తులల్లో రక్తం గడ్డకట్టడం, కాలర్ బోన్ ను రొమ్ము ఎముకను అనుసంధానించే కీళ్లల్లో ఆర్థరైటిస్ సమస్య రావడం వంటి కారణాల వల్ల నిరంతరం వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. ఇక సాధారణ వెక్కిళ్లు వచ్చినప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల వెక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. వెక్కిళ్లను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు.
ఒక గ్లాస్ నీటిలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. అయితే నీరు చల్లగా ఉండేలా చూసుకోవాలి. వెక్కిళ్లు వచ్చినప్పుడు లోతైన శ్వాసను తీసుకుని వీలైనంత సమయం వరకు శ్వాసను నిలిపి ఉంచాలి. శ్వాసను నిలిపి ఉంచడం సాధ్యం కానప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలాలి. వెక్కిళ్లు తగ్గే వరకు దీనిని పునరావృతం చేస్తూ ఉండాలి. ఒక టీ స్పూన్ చక్కెరను నోట్లో వేసుకుని నమలకుండా కరిగే వరకు అలాగే ఉంచుకోవాలి. చక్కెర కరిగిన తరువాత కొద్దిగా నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు త్వరగా తగ్గుతాయి.
వెక్కిళ్లతో బాధపడే వారు పీనట్ బటర్ ను తీసుకోవాలి. ఒక టీ స్పూన్ పీనట్ బటర్ తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. ఇక నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల కూడా వెక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. నిమ్మరసంలో నీరు కలపకుండా నేరుగా తాగాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు త్వరగా అదుపులోకి వస్తాయి. అలాగే కాగితంతో చేసిన బ్యాగ్ ను తెరిచి ఉంచిన వైపు నోటిపై ఉంచి గాలి బయటకు పోకుండా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు బ్యాగ్ నుండి గాలిని పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. అయితే గుండె జబ్బులు ఉన్నవారు దీనిని ప్రయత్నించకూడదు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వెనిగర్ వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల వెక్కిళ్లు త్వరగా తగ్గుతాయి.