Mosquitoes | ఏ సీజన్లో అయినా సరే దోమల బెడద తప్పడం లేదు. ఎన్ని రకాల మార్గాల్లో ప్రయత్నించినా ఏరోజు కారోజు మన ఇళ్లలో స్వైర విహారం చేసే దోమల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇంటి చుట్టు పక్కల నీరు నిలిచి ఉన్నా, కుంటలు, చెరువులు, మురికి కాలువలు, నాలాల వంటివి ఉన్నా దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో దోమల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే దోమల బెడద ఉండదు. మస్కిటో రీపెల్లంట్లను వాడడం అంత మంచిది కాదన్ని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు దోమలను తరమడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఒక పాత్రలో కాస్త నీటిని తీసుకుని అందులో కొన్ని కర్పూరం బిళ్లలను వేయాలి. అనంతరం ఆ పాత్రను దోమలు వచ్చే చోట ఉంచాలి. కిటికీలు లేదా ద్వారం వద్ద, గది మూలల్లో ఉంచాలి. లేదా కర్పూరాన్ని ఇంట్లో వెలిగించవచ్చు. దీంతో కర్పూరం వాసనకు దోమలు రావు. దోమలను రాకుండా చేయడంలో కర్సూరం అద్బుతంగా పనిచేస్తుంది. అలాగే పలు రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వాడినా కూడా దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా సిట్రొనెల్లా, యూకలిప్టస్, లావెండర్, టీ ట్రీ ఆయిల్ వంటి ఆయిల్స్‌లో మస్కిటో రీపెల్లింగ్ గుణాలు ఉంటాయి. కొన్ని చుక్కల ఆయిల్ ఏదైనా తీసుకుని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి రూమ్‌లో స్ప్రే చేయాలి. దీంతో దోమల బెడద తగ్గుతుంది.
దోమలను తరమడంలో వెల్లుల్లి కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కాస్త నలిపి నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాటిల్లో పోసి దోమలు వచ్చే చోట స్ప్రే చేస్తుండాలి. ఇలా చేస్తుంటే దోమలు ఇంట్లోకి రావు. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దోమలను తరిమేయగలదు. నీటిని, యాపిల్ సైడర్ వెనిగర్‌ను సమ భాగాల్లో తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని బాటిల్లో పోసి దోమలు ఉండే చోట స్ప్రే చేస్తుండాలి. దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. సాధారణంగా చాలా మంది ప్రస్తుతం తెలుపు రంగు కాంతిని ఇచ్చే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే బయటి వైపు మాత్రం పసుపు రంగు కాంతిని ఇచ్చే లైట్లను వాడాలి. వీటి వల్ల దోమలు ఇంట్లోకి అంతగా రావు.
దోమలను తరిమేయడంలో పుదీనా కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. మీ ఇంట్లో కుండీల్లో పుదీనా మొక్కలను పెంచితే దోమలు రాకుండా అడ్డుకోవచ్చు. లేదా పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలిపి బాటిల్లో పోసి స్ప్రే చేస్తుండాలి. పుదీనా ఆకులను నలిపి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవచ్చు. ఇలా చేస్తున్నా కూడా దోమలను అరికట్టవచ్చు. వేపాకులు కూడా దోమలను సమర్థవంతంగా బయటకు పంపుతాయి. వేపాకులను నిప్పులపై వేసి ఇంట్లో పొగపెడితే దోమలు పారిపోతాయి. వేపాకుల రసాన్ని నీటిలో కలిపి బాటిల్లో పోసి స్ప్రే చేస్తుండవచ్చు. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల దోమల నుంచి రక్షణ పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.