Hair Fall | ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మందులను ఎక్కువగా వాడడం, కాలుష్యం, నీటి ప్రభావం వంటి కారణాల వల్ల జుట్టు రాలుతోంది. దీని వల్ల యుక్త వయస్సులో ఉన్న పురుషులకు బట్టతల కూడా వస్తోంది. అయితే జుట్టు రాలే సమస్యకు చాలా వరకు ప్రధానంగా పోషకాలే కారణమవుతాయి. చాలా మంది పోషకాలు కలిగిన ఆహారాలను తినడం లేదు. దీని వల్ల శిరోజాలు రాలిపోతున్నాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారి దినచర్యలో భాగం చేసుకుంటే జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పలు రకాల విటమిన్లు, మినరల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయని వారు అంటున్నారు.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ వల్ల తయారవుతుంది. కనుక శరీరంలో కెరాటిన్ ఉత్పత్తి అవ్వాలంటే అందుకు మనం ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినాలి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కోడిగుడ్లను ప్రోటీన్లకు ఉత్తమ వనరుగా చెప్పవచ్చు. కనుక కోడిగుడ్లను రోజూ తింటే జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. కోడిగుడ్లలో బయోటిన్ అనే విటమిన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కూడా శరీరంలో కెరాటిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చికెన్ వంటి మాంసాహారంలోనూ ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటున్నా కూడా జుట్టు రాలడాన్ని ఆపవచ్చు.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు ఒత్తుగా పెరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పప్పు దినుసులు, శనగలను ఆహారంలో భాగం చేసుకున్నా మేలు జరుగుతుంది. వీటిల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్, జింక్, బయోటిన్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి ఆహారాల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు పెరిగేలా చేస్తాయి. కనుక వీటిని కూడా తరచూ తింటుండాలి.
పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బీన్స్లోనూ ఐరన్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల వీటిని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. గుమ్మడికాయ విత్తనాల్లో అధికంగా ఉండే ఐరన్, జింక్ వెంట్రుకలను సంరక్షిస్తాయి. జుట్టు సమస్యలు లేకుండా చేస్తాయి. జీడిపప్పును ఆహారంలో భాగం చేసుకున్నా ఎంతో ఫలితం ఉంటుంది. దీంతో జుట్టు సమస్యలు ఉండవు. వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటుంటే మేలు జరుగుతుంది. అవిసె గింజలు, చియా విత్తనాలను తింటున్నా జుట్టును సంరక్షించుకోవచ్చు. ఇలా ఈ ఆహారాలన్నీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. దీంతో శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.