Dry Lips | ముఖం అందంగా కనిపించడంలో పెదవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెదవుల అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు పెదవులకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తూ ఉంటాయి. వాటిలో పెదవులు పొడిబారడం కూడా ఒకటి. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. పెదవులు పొడిబారడం (Dry Lips) చాలా మందిని వేధించే సాధారణ సమస్య. చల్లని వాతావరణం, ఎండ తీవ్రత, నీటి లోపం, తరచుగా పెదవులను నాలుకతో తడి చేయడం, కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క, సిట్రస్, మింట్, మెంతోల్, కర్పూరం వంటి పదార్థాలు కలిగిన ఉత్పత్తులు పెదవుల పొడిబార్పును మరింత పెంచుతాయి. అయితే డెర్మటాలజిస్ట్ లు సూచించినట్లుగా పెదవులు పొడిబారడాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. పెదవుల పొడాబారడాన్ని తగ్గించే సులభమైన చిట్కాల గురించి వారు వివరిస్తున్నారు.
లిప్ బామ్‌ను నేరుగా అప్లై చేయకుండా ముందు స్వల్పంగా మాయిశ్చరైజర్‌ను రాయడం మంచిది. ఇది పెదవుల తేమను రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే పెదవులను తరచుగా నాలుకతో తడి చేయడం ఒక చెడు అలవాటు. తాత్కాలికంగా తేమ ఇచ్చినట్టు అనిపించినా, ఇది సహజమైన ఆయిల్స్‌ను తొలగించి మరింత పొడిబార్పుకు దారి తీస్తుంది. దీంతో ఒక చక్రంలా సమస్య పెరుగుతుంది. మ్యాట్ లిప్‌స్టిక్‌లను, ముఖ్యంగా ఎక్కువసేపు ఉండే డార్క్ షేడ్స్‌ను నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువగా వాక్స్, పౌడర్ కలిగి ఉండటంతో పెదవులను మరింత పొడిగా మార్చే అవకాశం ఉంటుంది. బదులుగా గ్లోసీ లేదా ఇతర షేడ్స్‌ను ఉపయోగించడం మంచిది.
అలాగే మొటిమల చికిత్స కోసం వాడే జెల్స్ (benzoyl peroxide, salicylic acid వంటి పదార్థాలు కలిగినవి) పెదవుల దగ్గర ఉపయోగించకూడదు. ఇవి చర్మంలోని ఆయిల్‌ను తగ్గించడానికి రూపొందించబడినవి కాబట్టి పెదవులకు చాలా కఠినంగా ఉంటాయి. రాత్రిపూట పెదవుల సంరక్షణ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు ముందు మాయిశ్చరైజర్‌ను రాసి, దాని పై పలుచని పెట్రోలియం జెల్లీ పొర వేస్తే ఉదయానికి పెదవులు తేమగా, మృదువుగా మారుతాయి. ఇటువంటి సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా పెదవుల పొడిబార్పును తగ్గించుకోవచ్చు. సరైన సంరక్షణతో పెదవులు ఆరోగ్యంగా, చక్కగా కనిపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.