Tea And Coffee | రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ పడుకునే వరకు చాలా మంది టీ, కాఫీలు తెగ తాగేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే రాత్రి పూట కూడా ఈ పానీయాలను తాగే వారు చాలా మందే ఉన్నారు. పని ఒత్తిడి లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే టీ, కాఫీలను తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే రోజూ మోతాదుకు మంచి టీ, కాఫీలను తాగితే ఆరోగ్యానికి హాని చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ మనకు హాని కలిగిస్తుందని వారు అంటున్నారు. మోతాదుకు మించి టీ, కాఫీలను సేవించడం వల్ల దుష్పరిణామాలు కలుగుతాయని వారు అంటున్నారు.
టీ, కాఫీల్లో కెఫీన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. మన శరీరానికి రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ చాలు. అంతకు మించితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే సుమారుగా 100 మిల్లీగ్రాముల మేర కెఫీన్ లభిస్తుంది. అంటే టీ లేదా కాఫీ ఏదైనా సరే రోజుకు 4 కప్పులకు మించకుండా తాగాలన్నమాట. కానీ కొందరు రోజుకు 10 కప్పుల వరకు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలను అధికంగా తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు కలుగుతాయి. నాడీ మండల వ్యవస్థ ప్రభావితం అవుతుంది. కంగారుగా ఉంటారు. నిద్రలేనట్లు, విశ్రాంతి లేనట్లు అనిపిస్తుంది.
టీ, కాఫీలను తాగడం వల్ల మన శరీరంలో చేరే కెఫీన్ మెలటోనిన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. ఇది నిద్ర హార్మోన్. రాత్రి పూట మన శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్లే మనం చీకటి పడగానే ఆటోమేటిగ్గా నిద్రిస్తాం. అయితే టీ, కాఫీలను తాగడం వల్ల వచ్చే కెఫీన్ మెలటోనిన్ ఉత్పత్తి కాకుండా చూస్తుంది. దీంతో రాత్రి అయినా కూడా నిద్ర పట్టదు. దీర్ఘకాలంలో ఇది నిద్రకు అవాంతరం కలిగించడమే కాకుండా నిద్రలేమి వచ్చేలా చేస్తుంది. కనుక టీ, కాఫీలను మోతాదుకు మించి తాగడం మంచిది కాదు. వీటిని అధికంగా సేవించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కలగజేస్తుంది. కొందరికి కడుపులో మంట కూడా వస్తుంది.
టీ, కాఫీలను అధికంగా తాగితే కొందరికి దీర్ఘకాలంలో జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా సేవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొందరికి తలనొప్పిగా ఉంటుంది. వికారంగా కూడా అనిపిస్తుంది. టీ, కాఫీలను అధికంగా సేవించడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈ పానీయాలను అధికంగా సేవిస్తే శరీరం మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను శోషించుకోలేదు. దీంతో రక్తహీనత తలెత్తుతుంది. దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా క్రమంగా క్షీణిస్తుంది. కొందరికి దంత క్షయం వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కనుక టీ, కాఫీలను అధికంగా తాగుతున్నవారు ఇప్పటికైనా వాటిని తాగడాన్ని తగ్గిస్తే మంచిది. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.