Copper Water | పూర్వం ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు ఆయుర్వేద ప్రకారం అనేక ఆహారపు అలవాట్లను పాటించే వారు. అందుకనే అప్పట్లో వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వృద్ధాప్యం వచ్చినా కూడా దృఢంగా ఉండేవారు. కంటి చూపు మెరుగ్గా ఉండేది. ఎముకలు బలంగా ఉండేవి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి కూడా సాధారణంగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. గుండె పోటు వస్తోంది. డయాబెటిస్ సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అసలు ఉండడం లేదు. కనుక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు గాను ఆయుర్వేద సూచించిన ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. వాటిల్లో ఒకటి.. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగడం. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. ఒకప్పడు మన పూర్వీకులు, పెద్దలు ఈ నీళ్లనే ఎక్కువగా తాగేవారు. కనుకనే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తామ్ర జలం అని పిలుస్తారు. తామ్రము అంటే రాగి అని అర్థం. కనుక రాగి పాత్రలోని నీళ్లను తామ్ర జలం అని పిలుస్తారు. ఇక ఈ నీళ్లను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. రాగి పాత్రలోని నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో అజీర్తి ఉండదు. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రాగిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ నీళ్లను సేవిస్తుంటే మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి రాగి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రాగి నీళ్లలో ఉండే ఎంజైమ్‌ల కారణంగా శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రాగి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. శరీర కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతో చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే మెలనిన్ వల్ల శిరోజాలు తెల్లబడడం తగ్గుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. వయస్సు మీద పడినప్పటికీ జుట్టు తెల్లబడదు. దీని వల్ల కూడా యవ్వనంగా కనిపిస్తారు. రాగి నీళ్లను తాగుతుంటే మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. యాక్టివ్‌గా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు.
రాగి వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రాగిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇక రాగి పాత్రలో నీళ్లను 12 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు. లేదంటే అందులో టాక్సిన్లు చేరే ప్రమాదం ఉంటుంది. రాగి పాత్రలు లేదా బాటిల్స్ లో సులభంగా ఆకుపచ్చని పాకురు లాంటి పదార్థం ఏర్పడుతుంది. కనుక పాత్రలను తరచూ శుభ్రం చేయాలి. అందుకు గాను నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడా వంటివి ఉపయోగించాలి. 100 శాతం స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన పాత్రలనే ఉపయోగించాలి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను రోజుకు 1 లేదా 2 గ్లాసులు మాత్రమే తాగాలి. అధికంగా తాగకూడదు. మరీ చల్లగా లేదా వేడిగా ఉండే నీళ్లను రాగి పాత్రలో నిల్వ ఉంచకూడదు. దీని వల్ల ఆ నీళ్లు విషంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ రాగి పాత్రలోని నీళ్లను తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.