Foods For Exercise | ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు నిద్రించడం మాత్రమే కాదు, సరైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. రోజూ వ్యాయామం కూడా చేయాలి. ఈ క్రమంలోనే డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన జిమ్‌లకు వెళ్లడం ఇష్టం లేని వారు తమకు ఉన్న స్థలంలో లేదా పార్కులు, రహదారులపై ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటివి చేస్తుంటారు. వాకింగ్, రన్నింగ్ తదితర వ్యాయామాలకు ఎలాంటి ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఎవరైనా సరే ఈ వ్యాయామాలను సులభంగా చేయవచ్చు. వీటి వల్ల శరీరం ఫిట్‌గా ఉండడమే కాదు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ వ్యాయామాలు చేసేవారు కచ్చితంగా సనైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే శక్తి లభించి ఉత్సాహంగా మరింత ఎక్కువ వ్యాయామం చేస్తారు.
వ్యాయామాలు చేసేవారు సరైన ఆహారం తినకపోతే శక్తి లభించదు. దీంతో వ్యాయామంపై ఆసక్తి తగ్గిపోతుంది. కనుక రన్నింగ్ లేదా వాకింగ్ వంటి వ్యాయామాలు చేసేవారు తమ ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పలు రకాల ఆహారాలను తింటే శక్తి లభించి ఆయా వ్యాయామాలను మరింత ఉత్సాహంగా చేస్తారు. అలాగే కండరాలకు పోషణ కూడా లభిస్తుంది. రన్నింగ్, వాకింగ్ చేసేవారు తినదగిన ఆహారాల్లో బాదంపప్పు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. బాదంపప్పును రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి వాటిని పొట్టు తీసి తినాలి. ఈ పప్పును రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచిది. వ్యాయామం చేశాక తింటే కోల్పోయిన శక్తి మళ్లీ వస్తుంది. అలాగే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. మరుసటి రోజు మరింత ఉత్సాహంగా వ్యాయామం చేస్తారు.
బాదంపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు రాకుండా చూస్తాయి. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఎంత వాకింగ్ లేదా రన్నింగ్ చేసినా నొప్పులు అనేవి ఉండవు. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బాదంలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జంక్ ఫుడ్ తినకుండా చూస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇలా ఆయా వ్యాయామాలు చేసేవారు బాదంపప్పును తింటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే నారింజ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఈ పండ్లను తింటున్నా లేదా వీటి జ్యూస్‌ను తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి కండరాలకు శక్తిని అందిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి రావు.
వ్యాయామం చేసేవారు చిలగడదుంపలను కూడా తింటుండాలి. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నొప్పులు తగ్గేందుకు సహాయం చేస్తాయి. కాబట్టి వ్యాయామం చేసేవారు ఈ దుంపలను కూడా కచ్చితంగా తింటుండాలి. అలాగే వారంలో కనీసం 2 సార్లు చేపలను తినాలి. రోజూ వ్యాయామం చేసేవారు తరచూ చేపలను తింటే ప్రోటీన్లను పొందవచ్చు. ఇవి కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. కండరాల నొప్పులను తగ్గిస్తాయి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. కనుక వ్యాయామాలు చేసేవారు కచ్చితంగా ఈ ఆహారాలను తింటుండాలి. దీంతో నీరసం, అలసట రావు. నొప్పులు ఉండకుండా జాగ్రత్త పడవచ్చు.