Ragi Laddu | ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో ఇప్పుడు చాలా మంది చిరు ధాన్యాలను తినడం ప్రారంభించారు. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు వీటినే ప్రధాన ఆహారంగా తినేవారు. అందుకనే వారు అన్ని ఏళ్ల పాటు ఆరోగ్యంగా బతికేవారు. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. శారీరకంగా చాలా దృఢంగా, యాక్టివ్‌గా ఉండేవారు. అయితే చిరు ధాన్యాల్లో రాగులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. రాగులతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. మన దేశంలో ఎంతో పూర్వ కాలం నుంచే రాగులను తింటున్నారు. రాగులతో పిండి తయారు చేసి దాంతో పలు వంటకాలను వండుతుంటారు. ఈ క్రమంలోనే రాగులకు చెందిన వంటకాల్లో రాగి లడ్డూలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటిని రోజుకు ఒకటి తింటే చాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వయస్సు మీద పడిన తరువాత ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సైతం తగ్గుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలనుకుంటున్న వారు రాగులను రోజూ ఏదో ఒక రూపంలో తింటే మేలు జరుగుతుంది. రాగులను లడ్డూల రూపంలో రోజూ తినడం చాలా సులభమైన పద్ధతిగా చెప్పవచ్చు.
రాగులు డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్ వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు సైతం రాగులను తినవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు రాగి లడ్డూలను తినాలనుకుంటే వాటిని బెల్లంతో తయారు చేసి తింటే మంచిది. లేదంటే ప్రయోజనాలు లభించవు. ఇక రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. అందువల్ల రాగి లడ్డూలను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రాగి పిండితో ఇతర వంటకాలను చేయడం రోజూ కష్టంతో కూడుకున్న పని. కానీ లడ్డూలను ఒకసారి చేసి పెట్టుకుంటే రోజూ ఒకటి చొప్పున తినవచ్చు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు. రాగి లడ్డూలను తయారు చేసేందుకు గాను రాగి పిండిని తీసుకుని ముందుగా దాన్ని పెనంపై వేయించాలి. తరువాత అందులో యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి. అనంతరం బెల్లం పాకం పట్టి ముందు సిద్ధం చేసుకున్న రాగి పిండిలో వేసి కలపాలి. అందులోనే కాస్త నెయ్యిని మరిగించి కలపాలి. ఈ పిండిని లడ్డూల్లా తయారు చేసి నిల్వ చేయాలి. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తినవచ్చు. అయితే బాదంపప్పు, ఖర్జూరాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి డ్రై ఫ్రూట్స్‌ను కూడా ఈ లడ్డూల్లో కలపవచ్చు. దీంతో మరిన్ని పోషకాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఇలా రాగి లడ్డూలను తయారు చేసి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.